ఏపీ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ 

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల గత కొన్ని నెలలుగా ఉద్యోగులు, పెన్షనర్లకు 50శాతం మాత్రమే చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ విశాఖకు చెందిన విశ్రాంత జడ్జి కామేశ్వరి వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ.. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు 12 శాతం వడ్డీతో సహా 2 నెలల్లోపు వేతన బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది.

 

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తో పాటు మరి కొన్నిరాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా 50 శాతం వేతనాన్ని చెల్లించేలా జీవోను జారీచేసిన చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో దానిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఐతే దీని పై తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో విచారించిన కోర్టు ఆ జీవోను కొట్టివేసింది.