ఏ క్షణంలోనైనా మోహిత్ రెడ్డి అరెస్ట్?
Published on: Tue Oct 7, 2025 5:43PM
.webp)
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో ఏ 39గా ఉన్న మోహిత్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. మద్యం డిస్ట్రిబ్యూటర్లు, సరఫరా కంపెనీల నుంచి అక్రమంగా వసూలు చేసిన ముడుపులను ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయడంలో మోహిత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ ఆరోపిస్తున్నది.
ముడుపుల నుంచి వచ్చిన అక్రమ డబ్బును రవాణా చేయడంలో మోహిత్ రెడ్డి పాలుపంచుకున్నారనీ, తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వాహనాలను ఉపయోగించి ఈ డబ్బును రవాణా చేశారనీ సిట్ తన దర్యాప్తులో గుర్తించింది. అలాగే తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ కంపెనీలు ద్వారా సొమ్మును వైట్ మనీగా మార్చినట్లు గుర్తించింది. మోహిత్ రెడ్డి రూ. 600 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు పత్రాలు సృష్టించి మనీ లాండరింగ్ చేశారని సిట్ తన దర్యాప్తులో తేల్చింది. ఈ నేపథ్యంలోనే తనను అరెస్టు చేయకుండా యాంటిసిపేటరీ బెయిలు కోసం మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ పెండింగ్ లో ఉన్న కారణంగా ఇంత కాలం మోహిత్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఉన్న సిట్.. ఇప్పుడు కోర్టు ఆ యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ రద్దు చేయడంతో ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు.


