మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చట్టంలో ఎక్కడుంది?

 

ఒకసారి రిజిస్టర్‌ చేయించుకున్న వాహనాలను తిరిగి రిజిస్టర్‌ చేసుకోవాలని చట్టంలో ఎక్కడ ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రంలోని వాహనాలను మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నిలిపివేతకు మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కల్యాణ్‌ జ్యోతిసేన్‌ గుప్తా, జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. నెంబర్‌ ప్లేట్ల మార్పు చట్టంలో ఎక్కడ ఉందని ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదిస్తున్న స్పెషల్‌ జీపీ బి. మహేందర్‌రెడ్డి మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 65, 212(1) ప్రకారం వాహనాల నెంబరు ప్లేట్ల మార్పు చేసుకోవాలని ప్రభుత్వం జీవో నంబర్ 3 జారీ చేసిందని, అయితే ఆ జీవోను ఇంత వరకు అమలు చేయలేదని ఆయన కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని గడువు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేయడానికి కోర్టు ప్రభుత్వానికి వారం రోజులు గడువిచ్చింది.