రాజ్యాంగ బద్ధంగా అసెంబ్లీ రద్దు జరగలేదు

 

తెలంగాణాలో తెరాస ప్రభుత్వం అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెరలేపిన సంగతి తెలిసిందే.తొమ్మిది నెలల ముందే అసెంబ్లీ రద్దు చేయడాన్నిసవాల్ చేస్తూ మాజీమంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, న్యాయవాది శశాంక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.కేబినెట్‌ నిర్ణయంతోనే సభను రద్దు చేయడం సరికాదన్నారు.అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని, ఎమ్మెల్యేలకు సైతం దీనిపై సమాచారం ఇవ్వలేదని డీకే అరుణ పిటిషన్‌లో పేర్కొన్నారు.ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పిటిషన్లని కొట్టివేసింది.

ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై ఈనెల 31న విచారణ జరగనుంది.కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు.ఈనెల 31న మరోసారి తమ వాదనలు వినిపిస్తామన్నారు.ఓటర్ లిస్ట్‌లో అధికారులు తప్పులు చేశారని, వాటిని రుజువు చేస్తామన్నారు.న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని కాంగ్రెస్ నేత మర్రిశశిథర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలకు భయపడి తాము కోర్టుకు వెళ్లామని ఓ మంత్రి అంటున్నారు.కానీ తాము తప్పులను బయటపెట్టడానికే కోర్టుకు వెళ్లామని స్పష్టం చేశారు.

సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఆరు నెలలలోపు ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉన్నందున తాము తెలంగాణకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎలక్షన్ కమిషన్ తరఫున న్యాయవాది హైకోర్టుకి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓటర్ల జాబితాను సైతం విడుదల చేశామని, ఏమైనా అభ్యంతరాలుంటే నామినేషన్ చివరి రోజు సాయంత్రం 3 గంటల వరకు తెలియజేసే అవకాశం కల్పించడం జరిగిందని కోర్టుకు వివరించారు.దీనికి స్పందించిన హైకోర్టు ఓటర్ల నమోదు ప్రక్రియను తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.కాగా, ప్రభుత్వ రద్దుకు వ్యతిరేకంగా వేసిన పిటీషన్లను కోర్టు కొట్టివేయడంతో తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌కు మార్గం సుగమం అయింది.