తెలంగాణ సచివాలయం నిర్మాణానికి బ్రేకులు?

 

సచివాలయం కూల్చివేత వ్యవహారం హైకోర్టులో మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చి వేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత జీవన్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎర్రగడ్డలో సచివాలయం నిర్మించాలని నిర్ణయించినప్పుడు 2016లో హైకోర్టులో జీవన్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కేవలం వాస్తు కోసం సచివాలయం కూల్చివేయడం సమంజసం కాదన్నారు. ప్రస్తుత సచివాలయం భవనాన్ని కూల్చబోమని సర్కారు తరపున అప్పటి అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హైకోర్టుకు నివేదించారు.

అయితే ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన మాట మార్చిందని, సచివాలయం భవనాల కూల్చివేతకు రంగం సిద్ధమైందని తాజాగా సోమవారం జీవన్ రెడ్డి తరపు న్యాయవాది సత్యంరెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కోర్టు శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది.

మరోవైపు శాసనసభ నిర్మాణం విషయంలోనూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. శాసనసభ నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌ లోని ఓ పురావస్తు భవనాన్ని కూల్చివేతకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీన్ని అడ్డుకోవాలంటూ కొంతమంది విద్యార్థులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని కూడా శుక్రవారం పరిశీలిస్తామని కోర్టు పేర్కొంది.