మీడియా గొంతు మూగబోవలసిందేనా?

 

గత మూడున్నర నెలలుగా తెలంగాణా రాష్ట్రంలో నిషేధానికి గురయిన ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ పునరుద్దరణకు ఆ సంస్థ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. చివరికి నిన్న హైకోర్టులో కూడా వారికి చుక్కెదురయింది. జస్టిస్ కళ్యాణ్‌జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం నిన్న తన తీర్పు ప్రకటిస్తూ ప్రైవేటు వ్యక్తులయిన తెలంగాణా యం.యస్.ఓ.లను ఛానల్ ప్రసారాలను పునరుద్దరించమని ఆదేశించలేమని, అందువలన ఈ వ్యవహారాన్ని సివిల్ కోర్టులో తేల్చుకోమని సూచించింది. సివిల్ కోర్టులో కేసులు తేలడానికి ఎన్నేళ్ళు పడతాయో అందరికీ తెలిసిన విషయమే. కనుక ఆ ప్రయత్నం కూడా వృధా ప్రయాసేనని చెప్పకతప్పదు. అందువల్ల సుప్రీంకోర్టుకు వెళ్ళడమే ఇక మిగిలింది. మన దేశంలో మీడియాకు చాలా స్వేచ్చ ఉందని విదేశాలు సైతం ప్రశంసిస్తుంటాయి. మన దేశంలో మీడియా స్వేచ్చకు సంకెళ్ళు పడటం చాలా అరుదనే చెప్పవచ్చును. కానీ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే ఆ మీడియా గొంతే మూగబోతుంటే, అందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు చివరికి కోర్టులు కూడా తమ నిస్సహాయత వ్యక్తం చేయడం చాలా విచారకరం. ఇదంతా చూసి ఇతర రాష్ట్రాలు కూడా తమకు నచ్చని మీడియా గొంతులను నొక్కే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఎంత మాత్రం మంచి పరిణామం కాదనే చెప్పవచ్చును.