సమ్మె ఆపుతారా లేదా చెప్పండి: హైకోర్టు

 

ఏపీఎన్జీవోల సమ్మెపై వరుసగా మూడవ రోజు కూడా హైకోర్టులోఇరుపక్షాల మధ్య సుదీర్గ వాదనలు జరిగాయి. అయితే, మధ్యలో కోర్టు కలుగజేసుకొని ప్రభుత్వోద్యోగులు భాద్యతతో వ్యవహరిస్తూ ప్రజలకు సేవ చేయాలని, కానీ వారు చేస్తున్ననిరవధిక సమ్మెవలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏపీఎన్జీవోల తరపున వాదిస్తున్నలాయర్ మోహన్ రెడ్డి అందుకు బదులిస్తూ, ఉద్యోగుల సమ్మెను కేవలం సమ్మెగా కాకుండా తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటంగా చూడాలని చెపుతూ, గతంలో తెలంగాణా ఉద్యోగులు కూడా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకోసం నెల రోజులు పైగా సకల జనుల సమ్మెచేసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన కోర్టుకు గుర్తు చేసారు. ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో ప్రజలందరూ కూడా స్వచ్చందంగా పాల్గొంటున్న సంగతిని కోర్టు గమనించాలని విన్నవించుకొన్నారు. కానీ, కోర్టు మాత్రం ఆయన వాదనలతో ఏకీభవించలేదు. ప్రభుత్వం లేదా అందులో ఒక వ్యవస్థ తమ కర్తవ్యం సమర్ధంగా నిర్వహించడంలో విఫలమయినప్పుడు కోర్టు జోక్యం చేసుకొని దానిని చక్కదిద్దవలసి వస్తుందని స్పష్టం చేసింది. ఉద్యోగులు సమ్మె విరమించుకుంటున్నారా లేదా? అనే సంగతిని రేపటి వాయిదాలో తప్పనిసరిగా స్పష్టం చేయాలని సూచిస్తూ కేసును రేపటికి వాయిదా వేసింది.