జగన్ సర్కారుకు మరో గట్టి ఎదురుదెబ్బ... 10రోజుల్లో నివేదిక కోరిన హైకోర్టు

సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పాలసీలకు అనుగుణంగా యంత్రాంగం నడుచుకోవడం కామన్. అయితే, తమ పార్టీ అధికారంలో ఉందని చెప్పుకోవడానికి ఆ పార్టీ రంగులను అక్కడక్కడా కనిపించేలా వేయడం కూడా సర్వసాధారణమే. కానీ అది శృతిమించినప్పుడే విమర్శలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అదే జరుగుతోంది. బడి, గుడి అని తేడా లేకుండా అన్నింటినీ వైసీపీ రంగులతో నింపేస్తున్నారు. దాంతో, ఏ ప్రభుత్వ భవనాన్ని చూసినా నీలం, ఆకుపచ్చ, తెలుపు రంగులే కనిపిస్తున్నాయి. చివరికి చెత్త కుండీలను కూడా వదలకుండా వైసీపీ రంగులతో నింపేస్తున్నారు.

అయితే, ఇలా ప్రభుత్వ భవనాలను వైసీపీ రంగులతో నింపేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష టీడీపీయే కాదు సామాన్య ప్రజానీకం కూడా ఈ రంగుల రాజకీయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఇలా ప్రభుత్వ భవనాలను వైసీపీ రంగులతో నింపేయడంపై జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు  తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
 
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్ పై విచారణపై జరిపిన ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ప్రశ్నించింది. పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడంపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ను హైకోర్టు ఆదేశించింది.