TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముగ్గురితో సరి..తెలంగాణ నుంచే చేర్పులు

Published on: Mon Feb 6, 2012 8:36AM

న్యూఢిల్లీ: మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అధిష్ఠానం అనుమతి ఇచ్చింది. తెలంగాణ ప్రాంతంలోని మూడు ఖాళీలను భర్తీ చేసేందుకు మాత్రమే హైకమాండ్ అంగీకరించింది. ఈనెల తొమ్మిదిన మంత్రివర్గం విస్తరణ జరగవచ్చు. మూడు రోజుల్లో విస్తరణ ప్రక్రియ ముగుస్తుందని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో, ఎనిమిదినైనా విస్తరణ ఉండొచ్చని భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చేయాలని కూడా నిర్ణయించారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమారెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కలకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పి కిష్టారెడ్డి పేరును ముఖ్యమంత్రి సూచించగా అందుకు హైకమాండ్ ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే వరంగల్ జిల్లాకు చెందిన గండ్ర వెంకటరమణారెడ్డిని కేబినెట్‌లోకి తీసుకుని కిష్టారెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి లభించవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. కానీ గండ్రకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇవ్వాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి ఇదివరకే వచ్చారని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మెదక్ జిల్లాకు చెందిన కిష్టారెడ్డినే మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

మెదక్ జిల్లాలో ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ నర్సింహ, భారీ పరిశ్రమల మంత్రి జె గీతారెడ్డి, మహిళా శిశు సంక్షేమ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. తాజాగా కిష్టారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే మెదక్ జిల్లానుంచి నలుగురికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించినట్టు అవుతుంది. ఢిల్లీలో రెండు రోజులుగా మకాం వేసిన ముఖ్యమంత్రి ఆదివారం మరోసారి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమై కేబినెట్ విస్తరణపై చర్చించారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం సోనియాగాంధీ నివాసంలో దాదాపు అర్థగంట పాటు జరిగిన కీలక సమావేశంలో తెలంగాణ ప్రాంతానికి ఖాళీలను భర్తీ చేయడం వరకే ప్రస్తుతం పరిమితం కావాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. సోనియాతో చర్చలు జరిపిన అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాదుకు వెళ్లిపోయారు.


ఇలాఉండగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు గతంలో మంత్రి పదవులకు రాజీనామా చేయగా ఇటీవల మంత్రి శంకరరావుకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రివర్గ ఖాళీల్లో రెండు అగ్రకులాలకు చెందినవి కాగా ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది. అదే విధానంలో ఇద్దరు అగ్రకులాలకు చెందిన వారికి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించడం ద్వారా మంత్రివర్గ ఖాళీలను భర్తీ చేయాలన్న ముఖ్యమంత్రి వాదనకు హైకమాండ్ అంగీకరించినట్టు తెలిసింది.