నటి అంజలి కేసులో కొత్త మలుపు
Published on: Wed Jul 17, 2013 3:55PM

సినీ నటి అంజలి తనకి నెలకు రూ. 50 వేలు జీవన భృతి చెల్లించాలని ఆమె పిన్ని భారతీ దేవి ప్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించి ఆగస్టు 14కు వాయిదా వేసింది. అంజలిని పెంచి పెద్ద చేయడంతో పాటు, హీరోయిన్‌గా చేయడానికి ఇప్పటి వరకు రూ. 70 లక్షలు అప్పులు చేసి ఖర్చు పెట్టానని, ఇప్పుడు తనను విడిచి వెళ్లింది కాబట్టి నెలకు రూ. 50 వేలు జీవన భృతి చెల్లించాలని పిటీషన్ లో పేర్కొంది. అంజలి అదృశ్యం నేపథ్యంలో భారతీదేవి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను నిన్న ఉపసంహరించుకుని, తాజాగా ఈ పిటిషన్ వేయడం విశేషం.
మరో వైపు అంజలిపై దర్శకుడు కళంజియం వేసిన పరువు నష్టం పిటీషన్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కూడా అంజలి పలు మార్లు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె ఒక్కసారి కూడా కోర్టు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.


