నాగార్జున సాగర్ టీఆర్ఎస్ రేసులో అల్లు అర్జున్ మామ?

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా  మారింది. ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ బైపోల్ లో పరాజయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుకున్న ఫలితం రాకపోవడంతో కుదేలైన కారు పార్టీకి.. సిట్టింగ్ సీటు అయిన  నాగార్జున సాగర్ లో గెలవడం అత్యంత కీలకం. ఇక్కడ కూడా వ్యతిరేక ఫలితం వస్తే పార్టీ భవిష్యత్ కు ప్రమాదమనే ఆందోళన అధికార పార్టీలో ఉంది. వరుస విజయాలతో ఇప్పటికే దూకుడు మీద ఉంది బీజేపీ. సాగర్ లో సత్తా చాటి పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తోంది హస్తం పార్టీ. దీంతో నాగార్జున సాగర్ ను ప్రతిష్టాత్మకంగా  తీసుకుంటున్న సీఎం కేసీఆర్.. ఎలాగైనా గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. అందుకే అభ్యర్థి ఎంపికలోనూ ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారని, అన్ని విధాలా సమీక్ష చేస్తున్నారని చెబుతున్నారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతం. గతంలో చలకుర్తిగా ఉన్న ఈ నియోజకవర్గం 2009లో నాగార్జున సాగర్ గా మారింది. ఇక్కడి నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు విజయం సాధించారు కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఆయన  ఓడిపోయారు. నోముల అనారోగ్యంతో చనిపోవడంతో సాగర్ సీటు ఇప్పుడు ఖాళీ అయింది. ఇక్కడ త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి మళ్లీ పోటీ చేయబోతున్నారు జానారెడ్డి. గతంలో జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసిగా ఉన్న జానారెడ్డి.. నియోజకవర్గంలో ప్రచారం కూడా చేసేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత, ఇక్కడ గట్టి పట్టున్న జానారెడ్డి ఖరారు కావడంతో క్యాండిడేట్ ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది అధికార పార్టీ. 

దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకే నాగార్జున సాగర్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ టీఆర్ఎస్ పార్టీలోని కొన్ని వర్గాల నుంచి వస్తోంది. నర్సింహయ్య తనయుడు, హైకోర్టు అడ్వకేట్ గా ఉన్న నోముల భగత్.... తనకు అవకాశం ఇవ్వాలని  పార్టీ హైకమాండ్ ను కోరుతున్నారు. అయితే దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్యను బరిలోకి దింపడంతో ఉప ఎన్నికలో పార్టీ ఓడిపోయింది. దుబ్బాకలో పార్టీకి అభ్యర్థే మైనస్ అయ్యారని టీఆర్ఎస్ నేతలు నిర్దారణకు వచ్చారు. దీంతో సాగర్ లో నోముల ఫ్యామిలీని బరిలోకి దింపే విషయంలో కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి లాంటి ఉద్దండ నేత పోటీ చేస్తున్నందున.. అతనికి భగత్ సరితూగలేరనే చర్చ పార్టీ నేతల నుంచే వస్తోందని తెలుస్తోంది. ఆర్థికంగా, రాజకీయంగా, స్థానికంగా  బలవంతుడైన జానారెడ్డిని ఎదుర్కోవడం నోముల కుటుంబానికి సాధ్యం కాదనే అభిప్రాయానికి గులాబీ పెద్దలు వచ్చారని చెబుతున్నారు.

నాగార్జున సాగర్ లో జానారెడ్డికి ధీటైన అభ్యర్థిని పోటీలో పెట్టాలని భావిస్తున్న గులాబీ బాస్.. సినీ హీరో అల్లు అర్జున్ మామ కంజర్ల చంద్రశేఖర్ రెడ్డిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్ లో చాలా కాలంగా పని చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి నాగార్జున సాగర్ పరిసర ప్రాంతానికి చెందిన వారు. ఆర్థికంగా జానారెడ్డి సరితూగే వ్యక్తి. అంతేకాదు మెగాస్టార్ కుటుంబానికి దగ్గరి బంధువు కావడం ఆయనకు అదనపు అర్హత. నాగార్జున సాగర్ లో రెడ్డి సామాజిక వర్గానిదే ఆదిపత్యం. ఈ లెక్కన సాగర్ లో పోటీకి చంద్రశేఖర్ రెడ్డి సరైన వ్యక్తని కేసీఆర్ భావిస్తున్నట్లు
తెలుస్తోంది. సాగర్ నియోజకవర్గంలో ఆంధ్రా సెటిలర్లు ఓట్లు కూడా వేలల్లోనే ఉన్నాయి. అల్లు అర్జున్ మామను బరిలోకి దింపితే ఈ ఓట్లు కూడా కలిసి వస్తాయని కేసీఆర్ లెక్కలు వేస్తున్నారని చెబుతున్నారు. 

దుబ్బాక  ఓటమి, జానారెడ్డిని ఎదుర్కోవడం వంటి అంశాల ఆధారంగా నాగార్జున సాగర్ లో అభ్యర్థి ఎంపిక సమీక్ష చేస్తున్న సీఎం కేసీఆర్.. కంజర్ల చంద్రశేఖర్ రెడ్డి అభ్యర్థిత్వంపై నల్గొండ జిల్లా నేతలతో పాటు పార్టీ ముఖ్యలతో చర్చించినట్లు తెలుస్తోంది. కంజర్ల పోటీపై పార్టీలోని అన్ని వర్గాల నుంచి సానుకూలత వస్తుందని చెబుతున్నారు.  పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాల ప్రకారం నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ నుంచి కంజర్ల చంద్రశేఖర్ రెడ్డిని ఖరారు చేయవచ్చనే ప్రచారం తెలంగాణ భవన్ లోనూ జోరుగా సాగుతోంది. అదే సమయంలో నోముల కుటుంబంలో ఒకరిని మండలికి పంపించే అవకాశం ఉందని చెబుతున్నారు.