నేను కావాలనుకుంటే సీఎం కుర్చీ నాదే..

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశిస్తూ ప్రముఖ నటి,ఎంపీ హేమమాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.ఇటీవల రాజస్థాన్‌లోని బన్స్‌వారా పట్టణంలో విలేకరులతో మాట్లాడిన హేమ మాలిని తన సినీ కెరీర్‌ వల్లే తనకు ఎంపీ అయ్యే అవకాశం వచ్చిందని, బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన ‘డ్రీమ్‌ గర్ల్‌’గానే తాను చాలా మందికి తెలుసని హేమ అన్నారు.

 

 

తాను పార్లమెంటుకు వెళ్లడానికి ముందే భాజపా కోసం చాలా పనిచేశానని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రధాని మోదీ రైతుల కోసం, మహిళలు, పేదల కోసం పనిచేస్తున్నారని ప్రశంసించారు.అలాంటి ప్రధాని దొరకడం చాలా కష్టమని అన్నారు.ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే అంగీకరిస్తారా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు హేమ ‘నేను కావాలనుకుంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రి కాగలను. నిమిషంలో ఆ పదవి పొందగలను. కానీ నేను ఆ పదవితో ముడిపడి ఉండటానికి ఇష్టపడను. దాని వల్ల నాకు పోరాడే స్వేచ్ఛ ముగిసిపోతుంది’ అని పేర్కొన్నారు.