TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శబరిమల ఆలయం సమీపంలో హెలికాప్టర్ చక్కర్లు.. విచారణకు ప్రభుత్వం ఆదేశం

Published on: Sat Apr 25, 2026 9:58AM

కేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంపై ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యంత సున్నితమైన,  రక్షణ పరంగా కట్టుదిట్టమైన భద్రత ఉండే శబరిమల క్షేత్రంపై ఇలా నిబంధనలకు విరుద్ధంగా హెలికాప్టర్ ఎగరడంపై కేరళ ప్రభుత్వం స్పందించి,  ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది.

సాధారణంగా శబరిమల ఆలయ పరిసరాలను  నో ఫ్లై జోన్ గా పరిగణిస్తారు. ఇక్కడ ఎటువంటి విమానాలు లేదా హెలికాప్టర్లు ప్రయాణించడానికి అనుమతి లేదు. అయితే,   కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ ఆలయ గోపురం మరియు పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువ ఎత్తులో పదేపదే చక్కర్లు కొట్టినట్లు భక్తులు, ఆలయ సిబ్బంది గుర్తించారు. ఇది భద్రతా పరమైన ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమేనని దేవస్థానం బోర్డు అంటోంది.  

ఈ పరిణామంపై ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆలయ పవిత్రతకు, భద్రతకు భంగం కలిగించేలా ఉన్న ఈ చర్యపై పోలీసు శాఖ మరియు పౌర విమానయాన సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది.   కేరళ దేవాదాయ శాఖ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సమగ్ర విచారణకు ఆదేశించింది. 

ఇలా ఉండగా.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల శబరిమల సన్నిధానం మీదుగా కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ప్రయాణించిన ఘటనలో ఎలాంటి భద్రతా లోపం లేదని తెలిసింది.  హెలికాప్టర్ ప్రయాణిస్తున్న సమయంలోనే అధికారులకు సమాచారం అందిందనీ..  సాంకేతిక సమస్యల కారణంగా హెలికాప్టర్ దిశ మార్చుకుందని  అధికారులు తెలిపారు.  పెరియార్ టైగర్ రిజర్వ్   అడవుల మధ్యలో ఉన్న శబరిమల ఆలయ ధ్వజస్తంభానికి కేవలం కొన్ని మీటర్ల ఎత్తులో గురువారం (ఏప్రిల్ 23) మధ్యాహ్నం  సీజీ 821 చేతక్ హెలికాప్టర్ ఎగురుతున్న దృశ్యాలను ఆలయ సిబ్బంది ఒకరు వీడియో తీశారు. 

కాగా దీనిపై భారత కోస్ట్ గార్డ్  అధికారులు వివరణ ఇచ్చారు. కొచ్చి నుండి సాధారణ శిక్షణ  విమానయానంలో ఉన్న సీజీ 821 హెలికాప్టర్, ఆ ప్రాంతంలో  ఎత్తైన మేఘాలు ప్రతికూల వాతావరణం కారణంగా.. పంపాలోని ఆలయం కొండల మీదుగా ప్రయాణించిందని భారత కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.