హెలికాప్టర్ కోసం కోర్టును బ్రతిమాలుకున్న గాలి
Published on: Fri Feb 10, 2012 2:26PM
హైద
రాబాద్: సిబిఐ స్వాధీనం చేసుకున్న హెలికాప్టర్‌ను తమకు తిరిగి ఇప్పించాలని అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస రెడ్డి కోర్టును కోరారు. ఈ మేరకు వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బిఎండబ్ల్యు, రోల్స్ రాయస్, ఇతర కార్లను కూడా తమకు ఇప్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. హెలికాప్టర్‌ను తాము ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) పేరుతో కొన్నామని వారు చెప్పారు. దర్యాప్తు సందర్భంగా సిబిఐ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని వాడకుండా వదిలేస్తే చెడిపోతాయని వారన్నారు. హెలికాప్టర్‌కు దాదాపు రెండు కోట్ల రూపాయలు చెల్లించి వాయిదాల పద్ధతిపై చెల్లింపు ఒప్పందంతో 2006లో హెలికాప్టర్ కొన్నామని, నెలకు రూ.10.31 లక్షలు వాయిదాలుగా చెల్లిస్తున్నామని వారు చెప్పారు. కేసు దర్యాప్తు ముగిసిన వెంటనే ఎప్పుడు అడిగితే అప్పుడు వాటిని కోర్టులో అప్పగిస్తామని వారు చెప్పారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.


