వారసులొస్తే.. రెబల్స్ రె‘ఢీ’.. టీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి
posted on: May 10, 2022 12:42PM
ఉన్న సమస్యలు చాలవన్నట్లు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికలలో కొత్త తలనొప్పి ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. ఏనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న ఆ పార్టీలో వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. అయితే సిట్టింగులు, సీనియర్లు, మంత్రులు మాత్రం తమ తమ నియోజకవర్గాలలో తాము పదిలం అని భావిస్తూనే.. గెలుపునకు అనువుగా ఉన్న నియోజకవర్గాలలో తమ వారసులను రంగంలోకి దింపేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ఆరంభించేశారు. అదిగో ఆ ప్రయత్నాలే అధికార పార్టీకి కొత్త తన నొప్పులు తెచ్చిపెడతాయంటున్నారు. ఇంత కాలంగా పార్టీని నమ్ముకుని నియోజకవర్గంలో చురుకుగా వ్యవహరించిన ఆశావహులు, ఇప్పుడు నేతల వారసుల ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమను కాదని వారసులకు పార్టీ టెకెట్లు ఇస్తే.. రెబల్స్ గా పోటీ చేసి సత్తాచాటుతామంటూ ఇప్పటి నుంచే హెచ్చరికలు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా కోరుట్ల, పెద్ద పల్లి నియోజకవర్గాలలో వారసుల ప్రవేశంపై స్థానిక టీఆర్ఎస్ క్యాడర్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు తన కుమారుడిని వచ్చే ఎన్నికలలో తన నియోజకవర్గం నుంచే బరిలోకి దింపాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే విద్యాసాగరరావు తనయయు సంజయ్ కోరుట్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. రాజకీయాలలో అవగాహన పెంచుకోవడంతో పాటు జనం సమస్యలూ తెలుసుకుంటూ, పార్టీ కార్యక్రమాల్లో క్రియా శీలంగా పాల్గొంటున్నారు. తండ్రి తరఫున ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో చురుకుగా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయకుండా కుమారుడిని బరిలోకి దింపాలన్నది విద్యాసాగరరావు వ్యూహంగా చెబుతున్నారు. అయితే ఇక్కడే కోరుట్ల నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో అసమ్మతి బీజాలు మొలకెత్తుతున్నాయి. విద్యాసాగరరావు ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఓకే కానీ ఆయన పోటీ చేయని పక్షంలో తమకే అవకాశం ఇవ్వాలని వారు ఇప్పటి నుంచే గళమెత్తుతున్నారు. తమకు టికెట్ దక్కని పక్షంలో రెబల్ గా బరిలోనికి దిగి సత్తా చాటుతామని హెచ్చరికలూ చేస్తున్నారు. దాదాపు ఇటువంటి పరిస్థితే పెద్దపల్లి నియోజకవర్గంలోనూ నెలకొని ఉంది. ప్రస్తుతం పెద్దపల్లి మునిసిపల్ చైర్మన్ గా ఉన్న దాసరి మమత.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పెద్దపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆమె మామ, సిట్టింగ్ ఎమ్మెల్యే దాసని మనోహరరెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటి నుంచే ఆయన నియోజకవర్గలో మమతకు ఎవరూ పోటీగా ఎదగకుండా చర్యలు ప్రారంభించారని చెబుతున్నారు. అయితే ఆయన ప్రయత్నాలకు స్థానిక నేతల నుంచి పెద్దగా మద్దతు రావడం లేదని తెలుస్తోంది. ఈ సారి పెద్దపల్లి టిఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు ఎగసిపడటం ఖాయమని స్థానిక నేతలు చెబుతున్నారు. మమతకు రెబల్స్ బెడద తప్పకపోవచ్చనీ అంటున్నారు.
వారసుల రాజకీయ ఎంట్రీ వార్తలతో ఇప్పటి నుంచే టీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు రగులుకుంటున్నాయి. ఎన్నికల నాటికి ఇవి మరింత పెరిగి అధికార పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టడం ఖామయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


.webp)



