కరోనా స్పైడర్లుగా జగనన్న పథకాలు!
Published on: Thu Jun 10, 2021 4:18PM
కొవిడ్ కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. పాజిటివిటి రేటు ఐదు శాతం ఉన్న రాష్ట్రాలు కూడా ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. కాని కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. కొవిడ్ కట్టడి కోసమంటూ కర్ఫ్యూ అమలు చేస్తోంది జగన్ రెడ్డి సర్కార్. కాని అదే సమయంలో జనాలంతా రద్దీగా ఉండే అవకాశాలు కల్పిస్తోంది. ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ కంపల్సరి చేయడంతో.. వాటి కోసం గుంపులు గుంపులుగా జనాలు ఆధార్ సెంటర్ల దగ్గర గుమి గూడుతున్నారు. దీంతో జగనన్న పథకాలే.. కొవిడ్ సూపర్ స్ప్రైడర్లుగా మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.
ఏపీలో జగనన్న ప్రభుత్వ పథకాలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్, పేర్లు, పుట్టినతేది సరిచేసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆధార్ సెంటర్ దగ్గరకు జనాలు బారులుతీరారు. గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎవరూ సామాజిక దూరం పాటించడంలేదు. కొందరు మాస్కులు కూడా లేకుండానే లైన్లలో నిల్చుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో తోపులాటలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
ఒక వైపు కరోనా భయం, మరో వైపు పథకాలు ఎక్కడ రాకుండపోతాయోనన్న భయం ఏపీ జనాలను వెంటాడుతోంది. క్యూ లైన్లలో వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. కోవిడ్ తీవ్రత తగ్గేవరకు ఈ నిబంధనలు తొలగిస్తే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల నుంచి వస్తోంది. ఆధార్ సెంటర్ల దగ్గరే కాకుండా మీ సేవా కేంద్రాల్లోనూ తప్పులు సరి చేసుకునే అవకాశం ఇచ్చినా రద్దీ కొంత తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇలా గుంపులు గుంపులుగా జనాలు వస్తే.. మళ్లీ కొవిడ్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


