వర్ష బీభత్సం

తెలుగు రాష్ట్రాలు వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం వర్షం కోసం ఆకాశంలోకి చూసిన రైతు ఇప్పుడు భూముల్లో పెరిగిపోయిన నీటిని ఎలా తోడాలా అని చూస్తున్నాడు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దక్షిణాది రాష్ట్రాలన్నీ వర్షాలతో సతమతమవుతున్నాయి. వరుణుడు ఎందుకు కరుణించడో.... ఎందుకు అతిగా కరుణిస్తాడో ఇంకా అంతు పట్టడం లేదు. సరిగ్గా పదిహేను రోజుల క్రితం వర్షాలు లేక రైతులు విలవిల్లాడారు. విత్తిన పైరు కేసి దిగాలుగా.. బెంగగా చూశారు. ఆ పైరు మెలకెత్తుతుందా.... ఎరువులు పని చేస్తాయా.. ఈసారైనా వరుణుడు కరుణిస్తాడా అని ఎదురుచూశారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురియకపోతే పంట ఎలా అని అయోమయపడ్డారు. పొలంలో ప్రతి పైరు తడిసేలా రైతులు గ్లాసులతోటి, చిన్న చిన్న చెంబులతోటి నీరు పోయడం పత్రికల్లో చూసిన వారికి కంటి వెంట నీరాగలేదు. ఇది రైతు దుస్థితి అని ప్రతి ఒక్కరు కంటి తడి పెట్టుకున్నారు. ప్రభుత్వాలు కూడా రైతులను ఆదుకుందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇక్కడి విషాదం. సరే, వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. వర్షాలు కురుస్తాయని ఆనందించిన రైతుకు అతివ్రష్టి రూపంలో వానలు విరుచుకుపడుతున్నాయి.

 


దీనికి రైతులు ఏమీ చేయలేని పరిస్థితి. గడచిన వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలను... ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలైతే ఈ వర్షాలకు భారీ మూల్యం చెల్లించేలా ఉన్నాయి. ఇక్కడ గడచిన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పొలాల్లో పైర్లు నీట మునిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్ష బీభత్సం దారుణంగా ఉంది. మొన్నటి దాకా మొలకలెత్తని నాట్లను చూస్తూ ఆకాశంపైకి చూపులు సారించిన రైతు ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ఏం చేయాలో పాలుపోక దేవుడా నీదే భారం అంటూ కూర్చున్నాడు. వర్షాలు కురియడం... పంటలు ఏపుగా పెరగడం.... నాణ్యమైన విత్తనాలు... ఎరువులు వాడడం.. రైతు ఇంట సిరులు కురియడం.... ఇవన్నీ పాతకాలపు మాటల్లా మారిపోయాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, ఏరువాకను ప్రారంభించాలని ప్రభుత్వాలు పండుగలు చేస్తున్నాయి.

 

 

గతంలో ఈ ఆడంబరాలు లేవు. ప్రభుత్వ వేడుకలు లేవు. ఏరువాక వచ్చిందంటే దానికి సంకేతంగా రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యేవారు. వారి పొలాల్లో  పనులు ముమ్మరంగా జరిగేవి. కాని నేడు ఆ పరిస్థితి ఏ జిల్లాలోనూ కానరావడం లేదు. ఆ మాటకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి.... దేశ వ్యాప్తంగానూ ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. ఇన్నాళ్లూ నీళ్లు లేవని గగ్గోలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు భారీగా కురిసిన వర్షాలతో నిండుకుండల్లా మారిన జలాశయాలు, మిగులు జలాలను ఎలా పరిరక్షించుకోవాలో మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. లక్షల క్యుసెక్కుల నీరు సముద్రం పాలు అవుతోంది. ఈ నీటిని నిలువ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం ఎలా వినియోగించుకోవాలో మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణం. 

 

 

ఇక ఈ భారీ వర్షాలకు దక్షాణాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రం చిగురుటాదకులా వణికిపోతోంది. అక్కడ పదిహేను రోజులుగా వర్షాలు తెరిపినివ్వడం లేదు. అక్కడి నదులు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన విమానాశ్రయాలు మూసివేశారు. పర్యాటకులకు స్వర్గధామమైన కేరళకు పర్యాటకులను రావద్దంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధించింది. కేరళలో ఇప్పటి వరకూ దాదాపు 350 మందికి కంటే ఎక్కువ మందే వర్షాల కారణంగా మరణించారు. ఇది అక్కడ నెలకొన్న విషాదం. శనివారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేరళలో ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇక్కడి ఈ బీభత్సాన్ని ఆయన ఎలా పరిగణిస్తారో చూడాలి. కేరళలో ఉన్నది వామపక్ష ప్రభుత్వం. అదే కోణంలో చూసి అక్కడి ప్రజలకు సాయం చేస్తారో... లేక మొండిచేయి చూపుతారా అన్నది ప్రశ్నార్ధకం. కేరళ విపత్తును జాతీయ విపత్తుగా చూడాలని ఆ ప్రభుత్వం కోరుతోంది. దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

 

 

తమిళనాడులో కూడా వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ గురువారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు తమిళనాడు కూడా భారీ మూల్యమే చెల్లించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణాలోనూ కురుస్తున్న వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల వెనుక ప్రభుత్వాలు ఏం చేస్తాయో వేచి చూడాలి. ఎన్నికల సీజన్‌ ప్రారంభమైన ఈ దశలో రైతులను ఎలా ఆదుకుంటారనేది వేచి చూడాలి. తెలంగాణలో రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం చేసింది. ఈ సాయం వెనుక రానున్న రానున్న ఎన్నికల కారణం కావచ్చు. కాని, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు మాత్రం ఇక్కడి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ఈ పరిస్థితులకు ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయింపు కాదు.  అయితే, ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులను ఎంత వరకూ ఆదుకుంటాయనేది చూడాలి. ప్రభుత్వాల నిర్ణయాలు, వారి ఆచరణ మారకపోతే రైతుల పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభట్లు అన్నట్లుగా మారతాయి.