TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ కు సెప్టెంబర్ గండం.. ముంపు భయంలో లోతట్టు జనం

Published on: Fri Sep 3, 2021 9:53AM

సెప్టెంబర్ మాసం అంటనే హైదరాబాదీలు వణికిపోతున్నారు. వరద గండం ముంచుకొస్తుందేమోనన్న భయంతో వణికిపోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో రాష్ట్రంతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి. రికార్డ్ స్థాయిలో కుండపోతగా వర్షం కురియడంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వంద లాది కాలనీలు రెండు, మూడు రోజుల పాటు నీళ్లలోనే ఉండిపోయారు. బైకులు, కార్లు వరదలో కొట్టుకుపోయాయి. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఆర్మీ రంగంలోకి దిగాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో ఊహించవచ్చు. కొన్ని కాలనీలు వారం రోజుల తర్వాత కూడా వరద నుంచి బయటపడలేకపోయాయి.

గత సెప్టెంబర్ లో వరద స్పష్టించిన బీభత్సాన్ని మరిచిపోకముందే మరోసారి హైదరాబాద్ పై వరుణుడు ప్రతాపం చూపించాడు. గురువారం రాత్రి రెండు గంటల పాటు బీభత్సంగా కురిసిన వర్షానికి మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. ఆకాశానికి చిల్లుపడిందా? అన్నట్లుగా కురిసిన వర్షంతో రాజధాని రోడ్లన్నీ కాల్వలను తలపించాయి. కాలనీలు చెరువులుగా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. గురువారం సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకు కురిసిన భారీ వర్షంతో   జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఖైరతాబాద్‌.. ఇలా ప్రధాన కూడలన్నీ చెరువుల్లా మారాయి. మైత్రీవనం మెట్రోస్టేషన్‌ వద్ద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. అమీర్‌పేట సత్యం థియేటర్‌ వరకు ఇదే పరిస్థితి. ఫలితంగా ప్రధాన కారిడార్లలో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. 

లోతట్లు ప్రాంతాల్లోని ఇళ్లలోకి మోకాలిలోతు నీరు చేరింది. కృష్ణానగర్‌ ఎ-బ్లాక్‌ వద్ద వరద ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోగా.. స్థానికులు కాపాడారు. నాలుగైదు గంటల పాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయమేర్పడి అంధకారం అలుముకుంది. వరద ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోరులు నిండిపోవడంతో పై అంతస్తుకు వెళ్లి ప్రజలు కాపాడుకున్నారు. రాత్రి ఎలా గడుస్తుందోనని బస్తీవాసులు హడలిపోయారు. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో నిత్యావసరాలు సహా ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలైన యూసుఫ్ గూడ, కృష్ణా నగర్ తో పాటు పలు బస్తీలు దారుణ పరిస్థితులు కనిపించాయి. 


జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 9.78 సెంటీమీటర్లు, అల్లాపూర్‌లో 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాదాపూర్‌లో 8.75, మోతీనగర్‌లో 7.98 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. జీహెచ్‌ఎంసీ అధికారులు ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దింపగా.. విద్యుత్తు అధికారులు ప్రజలకు పలు హెచ్చరికలు చేశారు. భారీ వర్షం బీభత్సంతో ప్రజలెవరు ఇండ్ల నుంచి బయటికి రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. 11 గంటల తర్వాత వాన తగ్గినా... ఉదయం వరకు రోడ్లపై వరద ప్రవహిస్తూనే ఉంది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్త రు వర్షాలు కురుస్తాయని, శనివారం ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె. నాగరత్న తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాదీలు అల్లాడిపోతున్నారు. సెప్టెంబర్ నెల గడిచే వరకు తమకు వరద గండం తప్పదనే భయంలో ఉన్నారు.