గుంటూరు జిల్లాని అదరగొట్టిన వాన
Published on: Thu Sep 18, 2014 11:48AM

గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పేరేచర్ల - నల్లపాడు రైల్వే స్టేషన్ల మధ్య 20 మీటర్ల మేర రైల్వేట్రాక్ దెబ్బతింది. దాంతో ఈ మార్గంలో వెళ్ళే రైళ్ళను నిలిపేశారు. రైల్వే ఉద్యోగులు వర్షంలోనే ట్రాక్ మరమ్మతులు చేపట్టారు. అలాగే సత్తెనపల్లి మండలం చినమక్కెన దగ్గర వర్షం వల్ల వంతెన కూలిపోవడంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చిలకలూరిపేటలో భారీ వర్షం ధాటికి ఎస్ఎస్‌పీ కార్యాలయం, పోలీస్ స్టేషన్ జలమయమయ్యాయి. ఓగేరు వాగుకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. ఈ వాగు ఉద్ధృతికి చిలకలూరిపేట - కోటప్పకొండ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కొండవీటివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగులకు గండ్లు పడి పొలాలు నీట మునిగాయి. హైదరాబాద్ - గుంటూరు రహదారి మీద నీటి ప్రవాహం కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి.


