TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వర్షాలతో దేశం తడిసిపోతోంది

Published on: Sat Jul 30, 2016 4:43PM

 

గత కొద్ది రోజులుగా ముంచెత్తుతున్న వర్షాలతో దేశం తడిసి ముద్దయిపోతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు అతివృష్టి దిశగా సాగుతున్నాయి. సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ హుటాహుటిన నేడు అసోంలో ఏరియల్‌ సర్వే చేసేందుకు బయల్దేరారంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతోనూ, వరదలతోనూ అసోంలోని జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్రం జలమయం కావడం వల్ల దాదాపు 5 లక్షల మంది నిరాశ్రయులైనట్లుగా చెబుతున్నారు. వరదలూ, వర్షాలతో నివాస భవనాలే కాకుండా రైల్వే, రహదారుల వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ప్రభుత్వం ఎక్కడికక్కడ నివాస శిబిరాలను ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న పంటలన్నీ వరదపాలైపోవడంతో ఆ రాష్ట్ర రైతుల బాధకు అంతులేకుండా పోయింది. అటు బీహార్‌లోనూ వరదల వల్ల ఏకంగా 26 మంది మృత్యువాత పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో ముఖ్యమైన త్రిపురలోనూ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి. రహదారుల మీదకు వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇదే అదనుగా వ్యాపారస్తులు, నిత్యవసరల వస్తువుల ధరలను పూర్తిగా ఆకాశానికెత్తేశారు. ఉత్తరాది పరిస్థితి అలా ఉంటే దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా ముంచెత్తిన వర్షాలతో నదలు సైతం పొంగి జనజీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. కొద్దిరోజుల పాటు రుతుపవనాలకు విరామం ఉంటుందంటూ వాతావరణశాఖ అధికారులు చేసిన సూచనల నేపథ్యంలో ఇలా వర్షాలు ముంచెత్తడంతో, మన సాంకేతికత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది!