ఇక్కడ కూడా నాలుగు చుక్కలు కురిస్తే బావుండు...



తుఫాను పుణ్యమా అని తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల పుణ్యమా అని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో దశాబ్దాల కాలంగా నిండని చెరువులు, డ్యామ్‌లు ఎంచక్కా నిండిపోయి కళకళలాడుతున్నాయి. నీరు పొంగి పొర్లుతూ సముద్రంలో కలసిపోతోంది. భారీ వర్షాల కారణంగా కొన్ని సమస్యలు, బాధలు ఎదురవుతున్నప్పటికీ మొత్తమ్మీద చూస్తే ఈ వరుణ కరుణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మేలు చేసిందనే చెప్పవచ్చు. వచ్చే ఎండాకాలం అక్కడ నీటి కొరత పెద్దగా వుండకపోవచ్చన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ సంగతి అంతా బాగుంది.. మరి ఇక్కడి సంగతేమిటని తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం బాధపడుతున్నారు. అక్కడ కురిసే భారీ వర్షాల్లోంచి నాలుగు చుక్కలు ఇక్కడ కూడా కురిస్తే బావుండని కోరుకుంటున్నారు.

గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు రైతులకు మొండిచేయి చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వర్షాకాలం మొత్తంలో సరైన వర్షాలు రెండు మూడు తప్ప పెద్దగా కురవలేదు. వర్షాకాలం వెళ్ళిపోయి చలికాలం వచ్చేసింది. సాధారణంగా ఈ సమయానికి తెలంగాణలోని అన్ని చెరువులూ నీళ్ళతో కళకళలాడాలి. అయితే ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. వర్షాన్ని నమ్ముకుని పంటలను సాగుచేసే రైతులు ఈ సంవత్సరం భారీగా నష్టపోయారు. ఎంతో ఆశతో వేసిన పంటలు ఎండిపోతూ వున్నాయి. ఎండిన పంటలను చూసి ఎంతోమంది రైతుల గుండెలు పగిలిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ పొలాల్లో వున్న పంటలు నీటి చుక్క కోసం ఆశగా ఎదురుచూస్తు్న్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా నాలుగు వర్షపు చినుకులు పడితే రైతులు గట్టెక్కుతారు. అయితే ఏపీలో కుంభవృష్టిని కురిపిస్తున్న వరుణుడు తెలంగాణ మీద కనీస కరుణ కూడా చూపించకపోవడం రైతులకు బాధ కలిగిస్తున్న విషయం.