TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఉత్తరాఖండ్ లో ప్రకృతి విలయం! వందలాది మంది గల్లంతు 

Published on: Sun Feb 7, 2021 1:02PM

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయం సంభవించింది. భారీ మంచుకొండ విరిగిపడటంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. ఉత్తరాఖండ్‌లో కొన్ని ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ధౌలిగంగా నది ఒక్కసారిగా ఉప్పొంగింది. నదికి ఆకస్మికంగా వరద రావడంతో ఆ ధాటికి దిగువన ఉన్న డ్యామ్ ధ్వంసమైంది. నీటి ప్రవాహ ఉద్ధృతికి ఆనకట్ట కొట్టుకుపోయింది.వరద నీరు చమోలీ జిల్లా రైనీ తపోవన్ వద్ద ఉన్న రుషి గంగా విద్యుత్ కేంద్రాన్ని ముంచెత్తగా, ఆ విద్యుత్ కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. అందులోని 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. 

 సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటీన రంగంలోకి దిగాయి. వరద నేపథ్యంలో ధౌలిగంగా నదీతీరంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సహాయక చర్యల కోసం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగం సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు.  ఘటనాస్థలికి ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయపడేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఓ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. పాత వీడియోలను చూపిస్తూ వందంతులు ప్రచారం చేయవద్దని కోరారు. 

భారీ వర్షాలు, అకస్మాత్తుగా వస్తున్న నీటి వల్ల చమోలీలోని రుషి గంగ గ్రామంలో రిషి గంగ ప్రాజెక్టుకు నష్టం జరగవచ్చునని ముఖ్యమంత్రి రావత్ తెలిపారు. నదిలోకి నీరు అకస్మాత్తుగా అధికంగా వస్తున్నందువల్ల అలకనంద ప్రాంతంలో వరదలు సంభవించే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. నదీ పరీవాహక ప్రాంతాల వెంబడి నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా భాగీరథి నదీ ప్రవాహాన్ని నిలిపివేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అలకనంద ప్రవాహాన్ని నిరోధించేందుకు శ్రీనగర్, హృషికేశ్ డ్యామ్‌లను ఖాళీ చేసినట్లు తెలిపారు. ఎస్‌డీఆర్ఎఫ్‌ను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అధికారులు తెలిపే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని తెలిపారు. 

ఉత్తరాఖండ్ వరదలతో ఉత్తర్ ప్రదేశ్ కు గండం పొంచి ఉంది. ఉత్తర ప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. గంగానది పరీవాహక ప్రాంతాల్లోని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గంగా నది పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నీటి స్థాయిని నిరంతరం గమనించాలని తెలిపారు. అవసరమైతే ప్రజలను వేరొక చోటుకు తరలించాలని తెలిపారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, పీఏసీ ఫ్లడ్ కంపెనీలను హై అలర్ట్‌లో ఉండాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు.