మూసీ వరద.. జంటనగరాల్లో పలు చోట్ల రాకపోకలు బంద్
Published on: Fri Aug 29, 2025 4:31PM

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని మూసీలోకి వదిలారు. ఉస్మాన్ సాగర్ ఎనిమిది గేట్లు పైకెత్తి 4100 క్యూసెక్కుల నీటినీ, హిమాయత్ సాగర్ 3 గేట్లు ఎత్తి 23వందలక్యూసెక్కుల నీటిని మూసిలోకి వదలడంతో మూసీనది మహోగ్రరూపం దాల్చింది. దీంతో బాపుఘాట్, అత్తాపూర్, పురానాఫూల్, చాదర్ఘాట్, మూసారంబాగ్ వద్ద వరద తీవ్రత పెరిగింది. మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆ రోడ్డును అధికారులు మూసివేశారు. దీంతో జియాగూడ పురానాపూల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ క్రమంలో పురానాపూల్ నుంచి హైకోర్టుకు వెళ్లే వాహనాలను కార్వాన్ నుంచి దారి మళ్లించారు. ఇక మూసారాంబాగ్ బ్రిడ్జ్‌పై కూడా మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిపై నుంచి రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వరద ధాికి బ్రిడ్జ్ పిల్లర్లు డ్యామేజ్ అయినట్లు అధికారులు తెలిపారు. బ్రిడ్జిని మూసివేయడంతో అంబర్ పేట, దిల్ షుక్ నగర్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.


