TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుపతిలో తీవ్ర‌ తోపులాట.. ముగ్గురికి గాయాలు.. అధికారులపై విమర్శలు..

Published on: Tue Apr 12, 2022 11:13AM

తిరుమ‌ల‌లో తీవ్ర తోపులాట‌. టోక‌న్ల కోసం భారీగా ఎగ‌బ‌డిన భ‌క్తులు. చేతులెత్తేసిన అధికారులు. క్యూలైన్ల‌లో చిన్న‌పిల్ల‌ల అవ‌స్థ‌లు. ముగ్గురికి గాయాలు. రుయా ఆసుప‌త్రికి త‌ర‌లింపు. 

క‌రోనా కార‌ణంగా రెండేళ్లుగా వెల‌వెల‌బోయిన తిరుమ‌ల‌.. కొన్ని నెల‌లుగా భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతోంది. రోజు రోజుకీ భ‌క్తుల ర‌ద్దీ పెరుగుతోంది. అయితే, చాలాకాలంగా రిలాక్స్ మోడ్‌లో ఉన్న టీటీడీ సిబ్బంది.. స‌రైన ఏర్పాట్లు చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. అది భ‌క్తుల పాలిట శాపంగా మారింది. 

తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు భారీగా ఎగబడటంతో తోపులాట చోటుచేసుకుంది.  రెండు రోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో భక్తులు తిరుపతిలో వేచి ఉన్నారు. తాజాగా మళ్లీ సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు తెరవడంతో భక్తులు భారీగా ఎగబడ్డారు. చిన్నపిల్లలతో క్యూలైన్లలో అవస్థలు పడ్డారు.

రెండు రోజుల విరామం అనంతరం తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ ద‌గ్గ‌ర‌ టోకెన్లు పంపిణీ చేశారు. భక్తులు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగింది. తోపులాట‌లో ముగ్గురు భక్తులు గాయపడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.టీటీడీ విజిలెన్స్‌, సిబ్బంది, పోలీసులు భక్తులను కంట్రోల్ చేయ‌లేక‌పోయారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.

బ్లాక్‌లో టికెట్లు అధిక ధరకు అమ్ముకుంటున్నారని భక్తులు ఆరోపించారు. టోకెన్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల‌పై మండిప‌డ్డారు.