TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో భానుడి భుగభగలు

Published on: Sun Apr 12, 2026 8:13AM

తెలంగాణపై భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరువ అవుతున్నాయి. రానున్న వారంపది రోజుల పాటు రాష్ట్రం నిప్పుల గుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాలలో 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశాలున్నాయని చెబుతోంది. ఈ నెల 22 వరకూ తెలంగాణలో హీట్ వేవ్ కొనసాగుతుందని పేర్కొంది.  రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరఖ కేంద్రం విడుదల చేసిన తాజా బులిటెన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా  గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. . రానున్న పది రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు    44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకూ  చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  ఇప్పటికే రాష్ట్రంలోని 27 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.  

హైదరాబాద్ నగరంలో కూడా ఎండలు మండిపోతున్నాయి.  వచ్చే వారంలో నగరంలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకూ చేరే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.   ఎండల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది.  .

బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే తలకు గొడుగు లేదా రుమాలు కట్టుకోవాలని, వదులైన కాటన్ దుస్తులు ధరించాలని అధికారులు చెబుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు తరచుగా మంచి నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని హితవు పలికారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పశువులు, మూగజీవాల పట్ల కూడా శ్రద్ధ వహించాలని, వాటికి నీడ, తాగునీరు అందుబాటులో ఉంచాలని అధికారులు కోరుతున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలు ఎండ నుంచి రక్షణ పొందే మార్గాలను పాటించడం ఉత్తమమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.