TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెయిల్ రద్దుపై విచారణ.. జగన్ మళ్ళీ జైలుకేనా?

Published on: Fri Nov 24, 2023 1:33PM

అసలే పాలనపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి మూటగట్టుకున్న ఏపీ సీఎం జగన్ కు ఇప్పుడు కోర్టులు ఇస్తున్న షాకులు మరింత గాభరాపెడుతున్నాయి.  తాజాగా గురువారం (నవంబర్ 23)  రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం  పాలనలో ఆర్ధిక అవకతవకలపై సీఎం జగన్ సహా క్యాబినెట్ మంత్రులకు కూడా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే శుక్రవారం  (నవంబర్ 24)  సుప్రీంకోర్టు మరో భారీ షాక్  ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు జైల్లో గడిపిన జగన్ ఇప్పుడు బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ బెయిలు రద్దు చేయాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మొదలు పెట్టింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు నవంబర్ మొదటి వారంలోనే విచారణకు స్వీకరించగా.. పిటిషనర్ కోరినట్లుగా ఈ కేసును మరో రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయకూడదో చెప్పాలని సీబీఐ, సీబీఐ కోర్టును సుప్రీం ఆదేశించింది.   ఇప్పుడు రెగ్యులర్ విచారణ మొదలు పెట్టిన సుప్రీం ధర్మాసనం.. సీబీఐ, జగన్ సహా ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది. అంతే కాకుండా జగన్ అక్రమాస్తుల కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ ను కూడా బెయిలు రద్దు పిటిషన్ తో కలిపాలని ఆదేశించింది. 

ఈ శుక్రవారం ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ రఘురామ లాయర్ ను ఉద్దేశించి ధర్మాసనం.. బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా? అని కూడా ప్రశ్నించింది. దీనికి రఘురామ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని కోరారు. దీంతో కోర్టు నోటీసులు జారీ చేసింది.  ఇప్పటికే విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని రఘురామ పిటిషన్‌లో కోరగా.. ఆ పిటిషన్‌కు ఈ బెయిల్ రద్దు పిటిషన్ కూడా జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.  తదుపరి విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.   జనవరిలో ఈ కేసులో ఎలాంటి కదలిక వచ్చినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీరని నష్టమే మిగల నుంది. ఈ కేసు విచారణలో సీబీఐ వేగం పెంచినా.. లేక జనవరిలో సుప్రీం ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసినా.. సీబీఐ వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని భావించినా జగన్ మోహన్ రెడ్డికి ప్రతికూలమే అవుతుంది. 

వచ్చే ఏడాది జనవరి అంటే సరిగ్గా ఎన్నికల సమయం. మహా అయితే ఎన్నికలకు రెండు మూడు నెలల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో అక్రమాస్తుల కేసు విచారణకు వస్తే వైసీపీ పరిస్థితి దారుణంగా మారుతుంది. జగన్ కేసులు విచారణకు వస్తే జగన్ అక్రమార్జన, క్విడ్ ప్రోకో, అరెస్టు వంటి అంశాలపై జనంలో చర్చ జరగడం ఖాయం. జగన్ అక్రమాస్తుల కేసులో ఎలాంటి కదలిక వచ్చినా అది జగన్ ప్రతిష్టకు విఘాతమే అవుతుంది. ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా కూడా మారుతుంది. ఎన్నికల వేళ సీబీఐ ఈ కేసు విచారణ వేగవంతం చేస్తే అది జగన్ కు శరాఘాతం కాక మానదు. అలాగే  జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. అప్పుడు కూడా కుంటి సాకులతో విచారణకు హాజరు కాకపొతే అరెస్ట్ తప్పదన్న హెచ్చరిక కోర్టునుంచి వచ్చినా ఆశ్చర్యం ఉండదు.  అసలు ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ అయి బెయిల్ రద్దు అయితే జగన్ మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అదే జరిగితే ఈసారి వైసీపీని కాపాడేందుకు ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ కూడా జగన్ తో లేరు.

నిజానికి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై ఉన్నారంటే.. బీజేపీతో ఉన్న సఖ్యత కారణంగానే అన్నది రాజకీయ వర్గాలలో అందరికీ తెలిసిన నిజమే. కేంద్రం అండదండలతోనే జగన్ ఈ కేసును విచారణ పరంగా ముందుకెళ్ళకుండా మ్యానేజ్ చేయగలుగుతున్నారన్నది బహిరంగ రహస్యమే. అయితే ఎన్నికల ముందు బీజేపీ జగన్ ను ఇలా కాపాడుతుందా.. అప్పుడు కూడా ఈ మైత్రి ఇలాగే  ఉంటుందా అంటే అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు. అయితే ఇప్పటికే సంవత్సరాల తరబడి ఈ కేసు సాగుతున్న నేపథ్యంలో  విచారణ వేగవంతం చేయడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. సీబీఐ అసలు ఈ కేసును ఇంత కాలం పాటు ఎందుకు విచారణ చేయడం లేదన్న విషయంపై కూడా సర్వోన్నత న్యాయస్థానం దృష్టి సారించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనవరిలో జగన్ బెయిల్ రద్దవుతుందా? సరిగ్గా ఎన్నికలకు ముందు మళ్ళీ జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తుందా అనే చర్చలు జరుగుతున్నాయి. ఒకవిధంగా వైసీపీకి ఇది అసలు సిసలైన సంక్షోభంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.