TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాహుల్‌ దీక్ష ఫలించేనా!

Published on: Sat Jan 30, 2016 9:44AM

రాహుల్‌ గాంధీ ఎప్పుడేం చేస్తారో ఎవరికీ తెలియదు. ఆయన చేసే పని వెనుక రాజకీయ చాతుర్యం ఉందో… లౌక్యం తెలియని తత్వం ఉందో అంతకంటే తెలియదు. రైతుల ఆత్మహత్యల దగ్గర నుంచీ దళితుల హత్యల వరకూ దేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నా నేరుగా పరామర్శించని రాహుల్‌ భాయ్‌ ఇప్పుడు రోహిత్‌ కుటుంబానికి అండగా నిలవడం సంతోషించదగ్గ విషయమే! కాంగ్రెస్‌ అధినాయత్వానికి ఎప్పుడూ తెలుగువారంటే చులకన అనీ, అందుకే వారిని చీల్చి లాభపడాలని చూస్తుంటారని వినిపించే ఆరోపణలన్నీ రాహుల్‌ ఒప్పుకోకపోవచ్చు. పి.వి.నరసింహరావుని కూరలో కరివేపాకులో తీసిపారేశారనీ, ఆంధ్రప్రదేశ్‌ని రాజకీయలబ్దితోనే హఠాత్తుగా విభజించారనీ… అదే రాజకీయ ఉద్దేశంతో ఇప్పుడు రోహిత్‌ మీద ప్రేమని ప్రదర్శిస్తున్నారనీ విపక్షాలు విమర్శించవచ్చుగాక! కానీ రాహుల్‌ మాత్రం తను రోహిత్‌ కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రత్యేక విమానంలో హుటాహుటిని వచ్చానని చెప్పారు.
 
జనవరి 30న మహాత్మాగాంధి హత్యకు గురైన రోజు. ఆ రోజున సాధారణంగా గాంధి వారసులంతా దిల్లీలోని రాజ్‌ఘాట్‌ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పిస్తారు. అయితే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగస్తూ రాహుల్‌ హైదరాబాదుకి చేరుకుని రోహిత్‌కు మద్దతుగా మౌనదీక్షలో పాల్గొనేందుకు నిర్ణయించుకున్నారు. తప్పకుండా ఈ చర్య వార్తల్లోకి వచ్చి తీరుతుంది. దేశమంతా రాహుల్‌ ఈ రోజున ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అని చర్చించుకుంటుంది?. ఈ విషయాన్ని గ్రహించే రాహుల్‌ సంచలనానికి దారి తీశారా అన్నదే ఇప్పటి ప్రశ్న! రాహుల్ తీరుపై ఎబివిపి చాలా తీవ్రంగా స్పందిస్తూ గొడవలకు దిగుతూ, బంద్‌లకు పిలుపునిస్తోంది. రాహుల్‌ ఈ విషయాన్ని ఊహించకుండా ఉండి ఉంటారా!
 
రోహిత్‌ మరణం నిజంగా దురదృష్టకరమే!  దానికి దారి తీసిన పరిస్థితుల మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగాల్సిందే! నాగరికత ఇంత ముందుకు సాగిన తరువాత కూడా కులాల పేరుతో కొట్టుకోవల్సిన అవసరం ఎందుకు కలుగుతోందో, ఎవరు కల్పిస్తున్నారో నిగ్గు తేల్చాల్సిందే! కానీ విచిత్రమేమిటంటే ఈ సమయంలో స్పందించాల్సినవారేమో మౌనంగా ఉన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన పెద్దరికం ఉన్నవారేమో విషయాన్ని మరింత జటిలం చేస్తున్నారు. రోహిత్ మరణం ఒక సమస్యకు సూచనగా కాకుండా ఒక అవకాశంగా నేతలు భావిస్తే కులాలకాష్టం నిరంతరం రగులుతూనే ఉంటుంది. కొందరు నేతలకి కావల్సింది అదేనా అన్నదే ఇప్పుడు అందరి మనసులలో మొదలవుతున్న భయం. ఇంత జరిగిన తరువాత గాంధీ చివరి మాటలు మాత్రం మళ్లీ గుర్తుకురాక మానవు – హే రాం!