TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

HCAలో ఏం జరుగుతోంది? అజార్ సస్పెండ్ కు కారణం ఎవరు? 

Published on: Thu Jun 17, 2021 10:35AM

వివాదాలకు కేంద్రంగా ఉండే హైదరాబాద్ క్రికెచ్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో మరో సంచలనం జరిగింది. హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఉన్న ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. అజార్ పై వేటు వేయడం క్రికెట్ వర్గాల్లో  సంచలనం సృష్టించింది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులైన కార్యదర్శి విజయానంద్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, సంయుక్త కార్యదర్శి నరేశ్ శర్మ, కోశాధికారి సురేందర్ కుమార్ అగర్వాల్, కౌన్సిలర్ పి అనురాధ సంయుక్తంగా షోకాజ్ నోటీసు జారీ చేశారు. అందులో అజారుద్దీన్ బీసీసీఐ, హెచ్‌సీఏ నిబంధనలకు విరుద్దంగా ఎలా ప్రవర్తించారో కూలంకషంగా వివరించారు. 

హెచ్ సీఏలో కొన్ని రోజులుగా వివాదం జరుగుతోంది. అపెక్స్ కౌన్సిల్‌లోని సభ్యులకు, అధ్యక్షుడు అజారుద్దీన్‌కు మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. పలు మార్లు ఈ రాజకీయాలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించుకున్నారు. అజార్ కు వ్యతిరేకంగా ఇతర సభ్యులు పోటాపోటీ సమావేశాలు నిర్వహించారు. అజార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.  ఈ నేపథ్యంలోనే హెచ్‌సీఏ జనరల్ బాడీ సభ్యుల నుంచి పలు పిర్యాదులు అందడంతో జూన్ 10న అపెక్స్ కౌన్సిల్ సమావేశమైంది. అజార్‌పై వచ్చిన ఆరోపణలను పూర్తిగా పరిశీలించింది. అజారుద్దీన్ దుబాయ్‌లో నార్తరన్ వారియర్స్ అనే క్లబ్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ గుర్తించని టీ10 లీగ్‌లో పాల్గొంటున్న ఈ క్లబ్‌కు అజార్ మెంటార్‌గా వ్యవహరించడం నిబంధనలకు విరుద్దమే కాకుండా పరస్పర విరుద్ద ప్రయోజనాల చట్టం కిందకు వస్తుందని అపెక్స్ కౌన్సిల్ నిర్దారించింది.హెచ్‌సీఏ రూల్ నెంబర్ 38(1)(3) ప్రకారం ఒక అనధికార లీగ్‌లోని క్లబ్‌కు మెంటార్‌గా ఉండి నిబంధనలు ఉల్లంఘించారంటూ సస్పెండ్ చేసింది అపెక్స్ కౌన్సిల్. 

అజారుద్దీన్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదనేది మరో ఆరోపణ. 2019 డిసెంబర్ 14న హెచ్‌సీఏ కార్యదర్శికి రాసిన లేఖలో తాను చివరి మ్యాచ్ ఆడిన 2000 మార్చి 6నే రిటైర్ అయినట్లు పరిగణించాలని కోరాడు. అదే విషయాన్ని బీసీసీఐకి తెలియజేయాలని కూడా లేఖలో పేర్కొన్నాడు. అంటే 19 ఏళ్ల పాటు తన రిటైర్మెంట్ గురించి చెప్పని అజారుద్దీన్.. సడెన్ గా 2019లో కేవలం ఒక లేఖ ద్వారా అప్పుడే రిటైర్ అయ్యానని చెప్పుకొచ్చాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డులో గానీ, అనుబంధ క్రికెట్ అసోసియేషన్లలో గానీ పదవి చేపట్టాలంటే క్రికెటర్లు రిటైర్ అయిన 5 ఏళ్ల తర్వాత మాత్రమే సాధ్యపడుతుంది. అయితే కీలకమైన హెచ్‌సీఏ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అజారుద్దీన్ తన రిటైర్మెంట్ గురించి ప్రకటించడం వివాదాస్పదంగా మారింది.

హెచ్‌సీఏకు దిల్‌షుక్‌నగర్‌లో ఉన్న కెనరా బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన లావాదేవీల్లో కూడా అవకతవకలను గుర్తించారని తెలుస్తోంది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అపెక్స్ కౌన్సిల్ వెంటనే అజారుద్దీన్‌ను పదవి నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. న్యాయ పరంగా ఈ విషయాలపై పూర్తి విచారణ పూర్తయ్యే వరకు అజారుద్దీన్ సస్పెన్షన్‌లోనే ఉంటారని అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. అయితే తన సస్పెన్సన్ పై న్యాయ పోరాటం చేస్తానని అజారుద్దీన్ ప్రకటించారు.