హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు బెయిల్
Published on: Thu Aug 28, 2025 7:38PM
.webp)
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. హెచ్‌సీఏ ఎన్నికల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలతో జగన్ మోహన్‌ను రావును సీఐడీ అరెస్ట్ చేసింది. దీంతో బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించటంతో పరిశీలించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ.1 లక్ష, రెండు షూరిటీ సంతకాలతో సమర్పించాలని ఆదేశించింది. అవినీతి ఆరోపణలతో పాటు హెచ్ సీఏ ఎన్నికల్లో 2016లో జరిగిన శ్రీచక్రా క్లబ్ ఫోర్జరీకి సంబంధించి నిర్దిష్ట ఆధారాలు చూపడంలో సీఐడీ విఫలమైందని తెలిపారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో జగన్మోహన్ రావు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యాడని సీఐడీ ఆరోపిస్తోంది.
గౌలీపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసి ఆ పత్రాలను జగన్మోహన్ రావుకు అందించారని సీఐడీ తెలిపింది. ఆ పత్రాలను ఉపయోగించి జగన్మోహన్ రావు హెచ్‌సీఏ అధ్యక్షుడైనట్లు సీఐడీ చెబుతోంది. ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ టికెట్ల వివాదంలోనూ ఆయనపై ఆరోపణలున్నాయి.ఇటీవలే జగన్మోహనరావుతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ సీఏ కార్యదర్శి దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాసరావులను కూడా హెచ్ సీఏ అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది.


