తెలంగాణ సచివాలయం కూల్చివేతపై హైకోర్టు సంచలన నిర్ణయం...

 

తెలంగాణ సచివాలయం కూల్చివేత నిన్న మొన్నటి దాకా పెద్ద చర్చనీయంశంగా మారిన సంగతి అందరికి తెలిసిందే .తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేయాలని ప్రభుత్వ నిర్ణయం పై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది.కొత్త భవనాల కూల్చి వేయడం ఏంటని ప్రశ్నించింది. ఫైర్ సేప్టీ అధికారుల చేసిన సూచనలు పాటించకుండా మొత్తం భవనాలనే కూల్చివేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఇవాళ కూడా సచివాలయం కూల్చివేత పై హైకోర్టులో విచారణ కొనసాగనుంది.
 
తెలంగాణ సచివాలయం కూల్చివేత అంశంపై హైకోర్టులో వాడి వేడి వాదనలు సాగాయి. అన్ని హంగులతో రెండు వేల పదమూడులో నిర్మించిన సచివాలయ బ్లాకును కూల్చివేయాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని హై కోర్టు ప్రశ్నించింది. రెండు వేల పదహారులో ఫైర్ సేఫ్టీ అధికారులు కొన్ని సూచనలు మాత్రమే చేశారని వాటిని కూల్చివేయమని చెప్పలేదని గుర్తు చేసింది. సి, డి ,ఈ బ్లాకుల్లో పెద్దగా లోపాలు లేవని నివేదిక స్పష్టం చేస్తోందని, అలాంటి వాటిని కూల్చి కొత్తగా నిర్మాణాలు చేపడతాం అంటే ఎలా అని ప్రశ్నించింది. పలు జిల్లా కోర్టుల్లో సరైన సౌకర్యాలు లేవని ఫైర్ సేప్టీ ఊసే లేదని న్యాయాధికారులు అక్కడే విధులు నిర్వహిస్తున్నారని గుర్తు చేసింది. జిల్లాలోని అన్ని కోట్లు కూల్చివేసి అన్ని సౌకర్యాలతో కొత్తవి కట్టాలని అడిగామా అని కోర్టు ప్రశ్నించింది. భవనాలకు తగిన మరమ్మతులు చేయడం ద్వారా తిరిగి వినియోగంలోకి తేవచ్చని సూచించింది. 

ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది కోట్ల మంది ప్రజల అవసరాలకు సరిపడా ఉన్న సచివాలయ భవనాలు ఏపీ ఖాళీ చేసిన తరవాత నాలుగు కోట్ల మంది అవసరాలకు సరిపడేలా లేవా అని ప్రశ్నించింది. కావాలంటే నూట ముప్పై ఏళ్ల క్రితం పధ్ధెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో నిర్మించిన జి బ్లాక్ శిథిలావస్థలో ఉండి వినియోగానికి పనికి రాకుండా ఉన్నందున దానిని కూల్చి అక్కడ మరో భవంతి కట్టుకోవచ్చని సూచించింది. కొత్తగా నిర్మించ తల పెట్టిన సచివాలయ టవర్లకు ఎలాంటి డిజైన్లు సిద్ధం చేశారని అదనపు ఏజీని ప్రశ్నించింది. డిజైన్ల రూపకల్పన పనిని రెండు సంస్థలకు అప్పగించామని ఆయన కోర్టుకు తెలిపారు. ఆ వివరాలను కోర్టు పరిశీలనకు ఇస్తామని చెప్పారు. దీంతో విచారణను హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం నేటికి వాయిదా వేసింది.
 
తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంతో పాటు మరి కొన్ని వ్యాజ్యాలను ధర్మాసనం విచారించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న భవనాలను మరో యాభై డెబ్బై సంవత్సరాల పాటు వినియోగించవచ్చని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. సచివాలయ భవనాలను కూల్చివేసి నాలుగు వందల కోట్లతో బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టిందని అవి పూర్తి అయ్యేసరికి ఖర్చు వెయ్యి కోట్లకు చేరుకునే అవకాశముందని ఆయన వివరించారు. 

మరోవైపు ఇంజనీరింగ్ చీఫ్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ కొత్త భవనాల నిర్మాణానికి సిఫార్సు చేసిందని ప్రభుత్వం తరపు న్యాయవాది అన్నారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం భవనాలను కూల్చివేయాలన్న మంత్రి మండలి నిర్ణయం తర్వాత నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందా, నివేదిక ఆధారంగా కూల్చి వేయాలని మంత్రి మండలి నిర్ణయించిందా అని హై కోర్టు ప్రశ్నించింది. ఏఏజీ బదులిస్తూ మంత్రి మండలి నిర్ణయం తర్వాత నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. మంత్రి మండలి నిర్ణయానికి అనుగుణంగా నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వడాన్ని ఆక్షేపించింది. అంతకు ముందు ఫైర్ సేప్టీ అధికారులు భవనాలను తనిఖీలు చేసి స్వల్ప మార్పులు సూచించారని ఆ మేరకు మరమ్మత్తులు చేసి అవసరమైన అగ్ని మాపక యంత్రాలు ఏర్పాటు చేసింది.చిన్న చిన్న మార్పులతో సరిపోయే దానికి ఏకంగా భవనం కూల్చివేయడం తగదు అని ప్రభుత్వ అధాయాన్ని వృధా చేయవద్దని హైకోర్ట్ వెల్లడించింది.