TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు గుర్తించే సాఫ్ట్‌వేర్ లేదు

Published on: Sat Oct 28, 2023 12:18PM

ఒక వ్యక్తి ఒక రాష్ట్రంలో ఓటు హక్కును వినియోగించడం సహజ న్యాయం. ఒకటికి మించి ఇతర రాష్ట్రాలలో ఓటు హక్కును వినియోగించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిది. దీన్ని నిలువరించే మెకానిజం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఎన్నికల కమిషన్ కూడా చేతులెత్తేసే పరిస్థితి ఉంది. ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో మరింతగా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగినవారు రెండు చోట్లా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై తాజాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా స్పందించారు.  ఓటర్లు రెండు చోట్లా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్టు పార్టీలు తమ దృష్టికి తెచ్చాయని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న విషయాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్ తమ వద్ద లేదని తెలిపారు. ఆయన వ్యాఖ్యలను బట్టి రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న వారిని ఓటు వేయకుండా అడ్డుకోలేమన్న విషయం స్పష్టమవుతోంది.  

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో వచ్చే అవకాశం ఉందని ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. నిన్న ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తొలి జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. జనవరి 1 నాటికి పూర్తి జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ఎవరైనా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇప్పటి వరకు ఆ పనిచేయని వారు డిసెంబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 లేదంటే జులై 1 లేదా, అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండితే కనుక అలాంటి వారు కూడా ముందస్తుగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. అలాగే, 10 లక్షల బోగస్ ఓట్లను తొలగించినట్టు వెల్లడించారు.