TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇక‌పై 'డ్రగ్స్' నేరం కాదు.. కేంద్రం కొత్త బిల్లు? మత్తు మజా..!

Published on: Thu Nov 25, 2021 3:47PM

ఇటీవ‌ల గుజ‌రాత్ ముంద్రా పోర్టులో వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్‌ను ప‌ట్టుకున్నారు. డొంక లాగితే ఆ డ్ర‌గ్స్ లింకులు విజ‌య‌వాడ‌లో వెలుగుచూశాయి. వైసీపీ నేత‌ల క‌నుస‌న్న‌ల్లో డ్ర‌గ్స్‌, గంజాయి దందా జ‌రుగుతోంద‌ని పెద్ద ఎత్తున‌ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇక, టాలీవుడ్ ప్ర‌ముఖులు అనేకులు డ్ర‌గ్స్ కేసులో చిక్కుకోవ‌డం.. బాలీవుడ్ స్టార్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌, శాండ‌ల్‌వుడ్‌లో డ్ర‌గ్స్ ర‌చ్చ‌.. లేటెస్ట్‌గా ఆర్య‌న్‌ఖాన్ కేసు.. ఇలా దేశ‌వ్యాప్తంగా డ్ర‌గ్స్ ఎపిసోడ్స్‌ ఎంత సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయో తెలిసిందే. ఇక లాభం లేద‌నుకున్నారో.. డ్ర‌గ్స్‌ను అరిక‌ట్ట‌డం త‌మ వ‌ల్ల సాధ్యం కాద‌ని డిసైడ్ అయ్యారో ఏమో కానీ, కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనుంద‌ని తెలుస్తోంది. 

మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం నేరం కాదని తెలిపే బిల్లును కేంద్రం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహా ఇతర మంత్రిత్వ శాఖలు ఇటీవల ప్రధాన మంత్రి కార్యాలయానికి ఇచ్చిన సలహా మేరకు ఈ బిల్లును రూపొందించినట్టు స‌మాచారం. అయితే, డ్ర‌గ్స్ క‌లిగి ఉండ‌టంలో కొన్ని కండీష‌న్స్ విధించ‌నున్నారని.. వ్యక్తిగత వినియోగం కోసం పరిమిత స్థాయిలో మాత్ర‌మే మాద‌క ద్ర‌వ్యాల‌కు అనుమ‌తించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. 

దేశంలో మాదక ద్రవ్యాల కేసులపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత వినియోగం కోసం కొద్ది మొత్తంలో మాదక ద్రవ్యాలను కలిగియుండటం నేరం కాదని తెలిపే చట్టాన్ని రూపొందించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మాదక ద్రవ్యాలు, ఉన్మత్త పదార్థాల (ఎన్‌డీపీఎస్) చట్టాన్ని సమీక్షించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవిన్యూకు తెలిపింది. మాదక ద్రవ్యాలను ఉపయోగించే వారిని, వాటిపై ఆధారపడే వారిని బాధితులుగా పరిగణించాలని, వారిని జైళ్లకు బదులుగా డీ-ఎడిక్షన్ సెంటర్లకు పంపించాలని సూచించింది. 

దేశంలో మాదక ద్రవ్యాలను కలిగియుండటం, అమ్మడం, దిగుమతి చేసుకోవడం, వాటితో వ్యాపారం చేయడం నేరమని ఎన్‌డీపీఎస్ చట్టం చెప్తోంది. ఈ చట్టం దేశంలోని పౌరులతో పాటు భారత దేశానికి వెలుపల ఉన్న భారతీయులకు కూడా వర్తిస్తుంది. భారత దేశంలో రిజిస్టర్ అయిన నౌకలు, విమానాల్లో ఉన్నవారు కూడా చ‌ట్టం కింద‌కు వ‌స్తారు. జప్తు చేసిన మాదక ద్రవ్యం పరిమాణాన్ని బట్టి నేరస్థునికి శిక్ష ఉంటుంది. అయితే.. ఈ చ‌ట్టానికి మార్పులు చేయాల‌ని కేంద్రం భావిస్తోంది. కొద్ది ప‌రిమాణంలో, అదికూడా వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు డ్ర‌గ్స్ క‌లిగి ఉండ‌టం నేరం కాద‌ని.. డ్ర‌గ్స్ వాడే వారిని బాధితులుగా చూసేలా చ‌ట్టానికి మార్పులు చేసేందుకు కేంద్రం స‌మాయ‌త్తం అవుతోంద‌ని స‌మాచారం.