మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా?
posted on: Feb 23, 2026 5:25PM

ప్రపంచం మరో పెను ప్రమాదం ముంగిట ఉందా? రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కేవలం రెండు దేశాల సరిహద్దు పోరాటం కాదా? అనే ప్రశ్నలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అవుననే సమాధానమే చెబుతున్నారు. పుతిన్ ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపారని, ఆయన సామ్రాజ్య కాంక్షకు అడ్డుకట్ట వేయకపోతే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని సంచలన హెచ్చరికలు జారీ చేశారు. శాంతి కోసం ఉక్రెయిన్ తన ఆత్మగౌరవాన్ని, భూభాగాలను తాకట్టు పెట్టదని స్పష్టం చేస్తూనే.. ప్రపంచ దేశాలన్నీ జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆ క్రమంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరో కీలక మలుపు తిరిగినట్లైంది. కీవ్‌లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో జరిగిన తాజా ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. పుతిన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రష్యా ఆక్రమించిన ప్రాంతాలతో పాటు ప్రస్తుతం ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న డోనెట్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియాలోని మరికొన్ని వ్యూహాత్మక ప్రాంతాలను వదులుకోవాలనే పుతిన్ డిమాండ్‌ను జెలెన్‌స్కీ తప్పుబట్టారు.
ఆ ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకోవడం అంటే తమ రక్షణ వ్యవస్థను బలహీన పరుచుకోవడమేనని, అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది తమ పౌరులను శత్రువుల పాలు చేసి.. వారిని వదిలేయడమే అవుతుంని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ భూభాగాలను వదులుకుంటే పుతిన్ సంతృప్తి చెందుతారా? అన్న ప్రశ్నకు జెలెన్‌స్కీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
పుతిన్ ఇప్పుడు కాల్పుల విరమణ కోరుకుంటున్నది కేవలం తన దళాలు తిరిగి పుంజుకోవడానికి మాత్రమేనని జెలెన్‌స్కీ విశ్లేషించారు. ఐరోపా భాగస్వాములు పుతిన్ కోలుకోవడానికి 3 నుంచి 5 ఏళ్లు పడుతుందని భావిస్తున్నప్పటికీ.. ఆయన కేవలం రెండేళ్లలోనే మళ్లీ సిద్ధమవుతారని హెచ్చరించారు. ఆ తర్వాత ఆయన తదుపరి లక్ష్యం ఏ దేశం అవుతుందో ఎవరికీ తెలియదని.. కానీ యుద్ధాన్ని కొనసాగించడమే పుతిన్ నైజమని స్పష్టం చేశారు.




.webp)


