కశ్మీర్ అమ్మాయిలపై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

 

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని, భారత్ కి నిజమైన స్వాతంత్య్రం ఇప్పుడే వచ్చిందని పలువురు ప్రశంసిస్తుంటే కొందరు మాత్రం కశ్మీర్ అమ్మాయిల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ ఆర్టికల్ 370 పై స్పందిస్తూ.. తమ మంత్రి ఓపీ ధన్‌ఖర్ బీహార్ నుంచి కోడళ్లను తీసుకొస్తానని చెప్పేవారని, ఇప్పుడు కశ్మీర్ నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయిందంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ కూడా కశ్మీర్ యువతుల గురించి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ఆర్టికల్ 370 రద్దు కావడంతో ఇకపై తెల్లని కశ్మీరీ అమ్మాయిలను ఎలాంటి భయం లేకుండా పెళ్లాడవచ్చని అన్నారు. అంతేకాదు, బీజేపీలోని అవివాహిత నాయకులు కశ్మీర్ వెళ్లి ప్లాట్లు కొనుక్కుని పెళ్లిళ్లు చేసుకోవచ్చని బీజేపీ ఎమ్మెల్యే సూచించారు. ఆర్టికల్ 370 వంటి పెద్ద నిర్ణయం గురించి కశ్మీర్ ప్రజలకు అర్థమయ్యేలా, దేశ ప్రజలు గర్వపడేలా వ్యాఖ్యలు చేయాలి కానీ ఇలా అమ్మాయిలు, అందం, పెళ్లి అంటూ నాయకులు దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.