వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయవారసత్వం?

posted on: Aug 20, 2026 11:42AM

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం నుంచి మూడో తరం రాజకీయవారసత్వం రాబోతోందా? ఆయన మనవరాలు, వైసీపీ  అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్ కుమార్తె హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా?  దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో కుటుంబ ప్రాభవం తగ్గుతున్న సూచనల నేపథ్యంలో జిల్లాపై ఆధిపత్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో జగన్ తన కుమార్తెను వ్యూహాత్మకంగా రాజకీయాలలోకి దించుతున్నారా అంటే.. ఔననే వినిపిస్తున్నది.

కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు. అయితే కడప  జిల్లాలో మాత్రం హర్షారెడ్డి రాజకీయ ప్రవేశంపై జోరుగా సాగుతున్న ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది.  

 ఒకవేళ హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ప్రచారం నిజమే అయితే.. అంటే ఆమె ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం అంటూ జరిగితే..  అది కేవలం ఒక కుటుంబ సభ్యురాలి ఎంట్రీ మాత్రమే కాకుండా, వైఎస్ కుటుంబ రాజకీయ వారసత్వ కొనసాగింపుగా భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ  భవిష్యత్ కార్యాచరణలో భాగంగా యువతను, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఆమె పొలిటికల్ ఎంట్రీ దోహదపడుతుందన్న విశ్వాసం వైసీపీ వర్గాలలో బలంగా వ్యక్తమౌతోంది.  

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం హర్షారెడ్డి కడప నుంచి లోక్ సభ లేదా అసెంబ్లీ బరిలోకి దిగుతారు.  అయితే అంతకంటే ముందు..  పార్టీ సంస్థాగత, యూత్ విభాగాల్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  రాయలసీమ, మరీ ముఖ్యంగా కడప జిల్లాలో  వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు ఇటీవలి కాలంలో సడలింది.

జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జగన్ కు వ్యతిరేకంగా  వైఎస్ సునీత, షర్మిల నిలబడటంతో వైఎష్ కుటుంబ ఓటు బ్యాంకు కూడా నిట్టనిలువుగా చీలిపోయిందంటున్నారు. ఇప్పుడు వైఎస్ కుటుంబం నుంచి హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం  అంటూ జరిగితే.. పరిస్థితులు జగన్ కు అనుకూలంగా మారే అవకాశం ఉందన్న ఆశాభావం వైసీపీయులలో వ్యక్తమౌతోందంటున్నారు పరిశీలకులు.

ప్రస్తుతానికి హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ప్రచారం స్థాయిలోనే ఉంది.  ఈ విషయంలో జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారన్న దానిపైనే ఆమె రాజకీయ ప్రవేశం ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. మరి జగన్  ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే. 

Harsha Reddy Political Entry, YS Jagan Daughter Harsha Reddy, AP Politics News, YSRCP Kadapa Politics, Harsha Reddy Kadapa Contest

google-ad-img
    Related Sigment News
    • Loading...