హరితహారానికి కొత్త అర్ధం.. వందలాది చెట్లను నరికి మామిడి మొక్కలు నాటారు!!

తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్, మంత్రులు సైతం స్వయంగా మొక్కలు నాటి ప్రజల్లో చైతన్య కలిగిస్తున్నారు. అంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం అభాసుపాలైంది. ఇన్నిరోజులు హరితహారమంటే మొక్కలు నాటి పచ్చదనం పెంచటం, ప్రకృతిని కాపాడటం అనుకున్నాం. కానీ, హరితహారమంటే ఉన్న పచ్చని చెట్లని నరికి ఆదాయమొచ్చే కొత్త మొక్కలు నాటడమని.. హరితహారానికి తెలంగాణ పోలీస్ అకాడమీ కొత్త అర్ధం చెప్పింది.

హరితహారం కార్యక్రమం లో భాగంగా కొత్త మొక్కలు నాటేందుకు వందలాది చెట్లను అధికారులు నరికించేశారు. హరితహారంలో మామిడి చెట్లను నాటడం ద్వారా భవిష్యత్తులో అకాడమీ ఆదాయాన్ని పెంచవచ్చని ఓ ఉన్నతాధికారి నిర్ణయించారట. అందుకే అక్కడ ఉన్న చెట్లను నరికించేశారు. అయితే ఆదాయం కోసం ఉన్న చెట్లను నరికి కొత్త మొక్కలను నాటడం హరితహారం ఎలా అవుతుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.