కాళేశ్వరం కోసం కష్టపడిన హరీష్ రావుని పక్కన పెట్టేసారు!!

 

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మేడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తే.. ఇక మంత్రులకుఅన్నారం, సుందిల్ల, కన్నేపల్లి బ్యారేజీలు.. ప్రాజెక్టులోని పంప్ హౌస్ లను అధికారంగా ప్రారంభించే అవకాశం దక్కింది.

అయితే కేసీఆర్ సీఎం హోదాలో కాళేశ్వరంను ఎంత పట్టుదలతో పూర్తి చేయించారో.. అంతే పట్టుదలతో హరీష్ రావు.. గడిచిన హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తయ్యేలా కృషి చేసారు. కేసీఆర్ గొప్పగా చెబుతున్నట్టు మూడేళ్లలోనే కాళేశ్వరం పూర్తి అయ్యిందంటే అదంతా హరీష్ రావు కృషే అంటారు.

అలాంటిది ఇప్పుడు కాళేశ్వరం ప్రారంభోత్సవంలో హరీష్ రావుకి కనీసం చోటు లేకపోవడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన మంత్రులు ఇప్పుడు వివిధ సహ బ్యారేజీలు, పంప్ హౌస్ లు ప్రారంభిస్తున్నారు. ప్రాజెక్ట్ కోసం అంత కృషి చేసిన హరీష్ రావుకు శిలా ఫలకంలో పేరు కాదు కదా.. కనీసం పిలుపు కూడా ఉందో లేదో తెలియని పరిస్థితి. కష్టమొకరిది.. వాటిని అనుభవించే ఫలితం మరొకరిదిలా తయారైందని హరీష్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా సభ ఏర్పాటు చేయకపోవడానికి ఓ రకంగా హరీష్ రావే కారణమని తెలుస్తోంది. ఒక భారీ ప్రాజెక్టును ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తున్నప్పుడు పెద్ద సభ పెట్టటం.. తమ ఆనందాన్ని, తాము సాధించిన విజయాన్ని చెప్పుకోవటం మామూలే. కానీ అందుకు భిన్నంగా కాళేశ్వరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేవలం పూజలకే పరిమితం చేసారు. ఒకేవేళ సభ ఏర్పాటు చేస్తే.. ప్రాజెక్ట్ కోసం కష్టపడిన హరీష్ రావు పేరుని ప్రస్తావించి ఆయనకు క్రెడిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పోనీ ఆయన పేరు ప్రస్తావించకుండా ఉందామా అంటే విమర్శలు వస్తాయి,   అటు పార్టీ శ్రేణుల్లోకి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఇదంతా ఎందుకు వచ్చిన తలనొప్పని సభ పెట్టలేదని తెలుస్తోంది.