హరీష్ రావుని కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారా?

 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. భవిష్యత్తులో తనయుడు కేటీఆర్ ని సీఎం చేయడం కోసం ఇప్పటి నుంచే హరీష్ రావుని పక్కన పెడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ లో జరుగుతున్న కొన్ని పరిణామాలను బట్టే విపక్షాలు అలాంటి ఆరోపణలు చేస్తున్నాయి. ఈ మధ్య టీఆర్ఎస్ లో హరీష్ పేరు అంతగా వినిపించట్లేదు. ఒకప్పుడు పార్టీలో నెంబర్ 2 గా ఉన్న హరీష్ ఈమధ్య పార్టీ కార్యక్రమాల్లో అంతగా కనిపించట్లేదు. హరీష్ కి మంత్రివర్గంలో కూడా చోటు దక్కలేదు. కేటీఆర్ కి కూడా మంత్రి పదవి ఇవ్వనప్పటికీ.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. దీంతో ఆయన పార్టీలో క్రియాశీలకంగా మారారు. దీంతో విపక్షాలు.. కేసీఆర్, హరీష్ ని కావాలనే పక్కన పెడుతున్నారు. హరీష్, కేసీఆర్ కి వెన్నుపోటు పొడిచే రోజు త్వరలోనే ఉందంటూ విమర్శిస్తున్నాయి. అయితే కేసీఆర్ విపక్షాలు విమర్శలు చేయడానికి తాజాగా మరో అవకాశం ఇచ్చారు. టీఆర్ఎస్ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో హరీష్ కి అవకాశం కల్పించకుండా పక్కన పెట్టారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 20 మంది స్టార్‌ క్యాంపెయినర్లుగా పాల్గొంటారని టీఆర్‌ఎస్‌ వెల్లడించింది. ఈ మేరకు సీఈవోకి వివరాలు అందజేసింది. అయితే టీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో హరీష్ పేరు లేకపోవడం గమనార్హం. జాబితాలో కేసీఆర్‌, కేటీఆర్‌తోపాటు.. మంత్రులు, పలువురి నేతల పేర్లు ఉన్నాయి. ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్.. గతంలో ఎన్నో నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం ఎంతో శ్రమించారు. ఎందరో అభ్యర్థుల గెలుపు బాధ్యతని తన భుజాన వేసుకున్నారు. తన వ్యూహాలతో బలమైన ప్రత్యర్థులను కూడా ఓడించి టీఆర్ఎస్ కు విజయాలు అందించారు. అలాంటి హరీష్ పేరు టీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో లేకపోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆశ్చర్య పోతున్నాయి. మరోవైపు విపక్షాలు కేసీఆర్, హరీష్ కి అన్యాయం చేస్తున్నారని విమర్శిస్తున్నాయి.