కేసీఆర్.. హరీష్ రావుని రాష్ట్ర రాజకీయాలకు దూరం చేస్తున్నారా?

 

కేసీఆర్ వ్యూహాలు రచించడంలో దిట్ట. ప్రత్యర్థుల ఊహలకు అందకుండా ఎత్తులు పైఎత్తులు వేస్తారు. విజయం సాధిస్తారు. ఇప్పటికే ఈ విషయం పలు సందర్భాల్లో రుజువైంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లి విపక్షాలకు షాక్ ఇచ్చారు. భారీ విజయం సాధించి అంతకన్నా పెద్ద షాక్ ఇచ్చారు. అంతకముందు నుంచే జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యాన్మాయంగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాస్త సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, పార్టీ కూడా ఘన విజయం సాధించింది. దీంతో ఉత్సాహంగా జాతీయ రాజకీయాలవైపు మళ్ళీ అడుగులు మొదలు పెట్టారు. దానిలో భాగంగానే తనయుడు కేటీఆర్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి పార్టీ బాధ్యతలు అప్పగించారు. అయితే ఇక్కడినుంచే కేసీఆర్ మార్క్ వ్యూహాలు మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల తరువాత కేటీఆర్ ని సీఎం చేసి.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారంటూ ఎప్పటినుంచే వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్టే ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే కేటీఆర్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ నియమించారు. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలో సీఎంని చేసే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ నిర్ణయాన్ని పార్టీ నేతలు ఎవరూ వ్యతిరేకించే అవకాశం లేదు. కానీ హరీష్ రావు వర్గం మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశముంది. హరీష్ రావు మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసారు. పార్టీలో బలమైన నేతగా ఎదిగారు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా మొన్న జరిగిన ఎన్నికల్లో లక్షకు పైగా మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు. మరి ఇలాంటి బలమైన నేత వర్గం అసంతృప్తిలో ఉంటే పార్టీకి నష్టం తప్పదు. ఆ అసంతృప్తి తారాస్థాయికి చేరితే పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే కేసీఆర్ తనతో పాటు హరీష్ రావుని కూడా జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారట. ఇలా చేస్తే కేటీఆర్ కు లైన్ క్లియర్ అయినట్లు ఉంటుంది. అలాగే జాతీయస్థాయిలో రాజకీయం చేయడానికి హరీష్ రావు లాంటి బలమైన నేత తనకి తోడు ఉన్నట్లు ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారట. నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీ గా పోటీ చేయనున్నారు. ఆయనతో హరీష్ రావుని కూడా ఎంపీగా బరిలోకి దించాలని చూస్తున్నారట. చూద్దాం మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో మందికి వెళ్తారో.