TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పారిశుద్ధ్య కార్మికుడిగా మారిన హరీష్ రావు! 

Published on: Wed Feb 3, 2021 10:27AM

ప్రజలతో మమేకం అవుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంలో అందరి కంటే ముందుంటారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. తన నియోజకవర్గం సిద్ధిపేటను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఆయన నిత్యం శ్రమిస్తుంటారు. తాజాగా పారిశుద్ధ్య కార్మికుని అవతారం ఎత్తారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట జిల్లా బుస్సాపూర్ పర్యటనకు వెళ్లిన హరీష్.. వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే యూనిట్ ను పరిశీలించారు. అక్కడి కార్మికులతో కలసి కొంత సేపు పనిచేశారు. కార్మికులు ధరించే యూనిఫామ్ ను వేసుకున్న హరీశ్ రావు.. కార్మికులతో కలిసి చెత్తను ఎత్తి  రీసైక్లింగ్ ప్లాంట్ లో వేశారు. 

వృథా అని భావించే ప్రతి వస్తువునూ ఏదో రూపంలో తిరిగి వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా చెప్పారు మంత్రి హరీష్ రావు. చెత్త చెదారాలను కొంచెం ఆలోచించి, శ్రమను జోడిస్తే, ఎరువులుగా, ఉపయోగకరమైన పదార్థాలుగా మార్చుకునే వీలుంటుందన్నారు. . సిద్ధిపేట పట్టణంలో రోజుకు 40 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని, దీనిలో తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు రూ. 2.50 కోట్లతో రీసైక్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని హరీష్ రావు తెలిపారు. 

అన్ని మునిసిపాలిటీల్లోనూ  ఇదే తరహా  రీసైక్లింగ్  ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు హరీష్ రావు.   ప్రజలు సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలను ఎస్ఎఫ్టీపీకి ఇవ్వాలని, దాన్ని రీసైకిల్ చేసిన తరువాత 800 కేజీల ఎరువు, 16 వేల లీటర్ల నీరు వస్తుందని నీటిని మొక్కలకు, ఎరువునురైతులకు ఫ్రీగా ఇవ్వనున్నామని చెప్పారు.మంత్రి హరీష్ రావు తమతో కలిసి పని చేయడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.