హరీష్ రావు మాటకారితనం ప్రదర్శిస్తున్నారా

 

కేసీఆర్ కుటుంబంలో అందరూ మంచి వాగ్ధాటి, రాజకీయ పరిణతి కలవారేనని అందరికీ తెలిసిన విషయమే. తెరాస నేతలు విద్యా, వ్యాపార, సినీ పరిశ్రమల నుండి బలవంతపు వసూళ్ళకు పాల్పడిన ఆరోపణలను కూడా మరిచిపోయి, ఏపీ ఎన్జీవోలు నిరవదిక సమ్మెకు దిగినప్పుడు రాజకీయ నాయకుల అండతో సమైక్యాంధ్ర అంటూ కృత్రిమ ఉద్యమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అదేవిధంగా సమైక్యవాదులు ఆర్టీసీ బస్సులను తిరగనివ్వకుండా చేసి, కొందరు రాజకీయ నేతల ప్రైవేట్ బస్సులు తిప్పుకోవడానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులు తమ సమైక్య ఉద్యమాలతో రెక్కాడితే గానీ డొక్కాడని పేద ప్రజల బ్రతుకులు దుర్భరం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేసారు. కానీ అవే పనులు తాము కూడా గతంలో చేసామన్న సంగతిని మాత్రం తెరాస నేతలు ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.

 

నిన్న బొత్స సత్యనారాయణ ఇంటిపై సమైఖ్యవాదులు చేసిన దాడిపై స్పందిస్తూ తెరాస నేత హరీష్ రావ్ మళ్ళీ తన మాటకారితనమంతా మరోమారు ప్రదర్శిస్తూ సమైక్యఉద్యమంలో చీలికలు తేవాలని ప్రయత్నించారు.

 

సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా బొత్స ఇంటిపై దాడిచేయమని సమైక్యవాదులను ప్రోత్సహించారని, ఆయన ఒక ఫ్యాక్షనిస్టుగా వ్యవహరించడం శోచనీయమని ఆన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కేవలం పార్టీల మధ్య, నేతల మధ్య, ఉద్యోగుల మధ్య జరుగుతున్నఆధిపత్య పోరు అని గ్రహించాలని ఆయన సీమాంధ్ర ప్రజలను హెచ్చరించారు. ఇప్పటికయినా ప్రజలు ఈ కృత్రిమ ఉద్యమం చేస్తున్నవారి మాటలకు తలొగ్గకుండా తెలంగాణా ఏర్పాటుకి అందరూ సహకరించాలని ఆయన కోరారు.

 

ఆయన మొదట సమైక్య ఉద్యమం రాజకీయ నాయకుల అండతో సాగుతున్న కృత్రిమ ఉద్యమమని హేళన చేసారు. కానీ రెండు నెలల తరువాత కూడా వారి ఉద్యమం కొనసాగుతుండటం చూసిన తరువాత ఇప్పుడు మాట మార్చి ఇది ఆధిపత్యం కోసం జరుగుతున్న ఉద్యమం అంటున్నారు.

 

రాజకీయనాయకుల అండతో సాగుతోందని మొదట ఆరోపించిన ఆయన, ఇప్పుడు అదే రాజకీయ నాయకుల ఇళ్ళ మీద ప్రజలు దాడులు చేస్తుంటే, ఇదంతా ముఖ్యమంత్రి పనే అని వక్ర భాష్యం చెపుతూ గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలకు విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

 

రాజకీయ నాయకుల అండతో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నట్లయితే వారు రాజకీయ నాయకులని ఎందుకు దూరం పెడతారు? ఎందుకు నానా విదాలుగా వారిని అవమానిస్తున్నారు? ఎందుకు నేడు వారి ఇళ్ళపై దాడులు చేస్తున్నారో హరీష్ రావ్ వంటి కుహాన మేధావులే వివరించాలి. ఈ ఉద్యమం రాజకీయ ఆధిపత్యం పోరుకోసం సాగుతున్న కృత్రిమ ఉద్యమo అంటూ సీమంధ్ర మంత్రులకి మధ్య ఆయన అపార్ధాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

 

హరీష్ రావ్ ఎంత గొప్ప మాటకారి అయినప్పటికీ లక్షలాది ప్రజలు స్వచ్చందంగా చేస్తున్నఉద్యమాలను ఈవిధంగా కించపరచడం, నేతల మధ్య తగవులు పెట్టే ప్రయత్నాలు చేయడం, తెలంగాణాను వ్యతిరేఖిస్తున్న కారణంగా ముఖ్యమంత్రిపై అబద్దాలను ప్రచారం చేయడం సబబు కాదని గ్రహించాలి.