హరికృష్ణ మరణం నేర్పిన పాఠం

 

నందమూరి కుటుంబానికి అభిమానగణం ఎక్కువ.. అభిమానులు ఆ కుటుంబం మీద ఎనలేని ప్రేమ చూపిస్తూ ఉంటారు.. నందమూరి హీరోలు కూడా అభిమానుల మీద అంతే ప్రేమ చూపిస్తూ, అభిమానుల బాగు కోరుకుంటూ ఉంటారు.. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పలు వేదికలపై పదే పదే ఓ విషయం గుర్తు చేసేవారు.. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటి దగ్గర మీ కోసం మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని అభిమానులను సున్నితంగా హెచ్చరించేవారు.. అయితే 2014 లో నందమూరి కుటుంబంలోనే ఓ విషాదం జరిగింది.

 

 

హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.. ఈ సంఘటనతో హరికృష్ణ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.. అన్న మృతితో జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా కృంగిపోయారు.. ఇలాంటి బాధ అభిమానులకు రాకూడదని, ఈసారి అభిమానులను ఇంకాస్త గట్టిగా హెచ్చరించారు.. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, మా కుటుంబంలో జరిగిన విషాదం ఏ కుటుంబంలో జరగకూడదని కోరుకుంటున్నాం అంటూ ఆయన సినిమా మొదలయ్యేటప్పుడు చూపించేవారు.. అదే విధంగా రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, వేగంగా వెళ్ళకండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటూ వేదికపై కూడా పదే పదే గుర్తుచేసేవాడు జూనియర్ ఎన్టీఆర్.. కానీ ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తన తండ్రి ప్రాణాలు కోల్పోతాడని ఎప్పుడూ ఊహించి ఉండడు.

 

 

హరికృష్ణ ఈరోజు రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.. ఈ ప్రమాదానికి అతి వేగం మరియు జాగ్రత్తలు పాటించకపోవటమే కారణంగా తెలుస్తోంది.. హరికృష్ణ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా, అతి వేగంగా వెళ్తూ.. వెనకనున్న వాటర్ బాటిల్ తీసుకోబోతుండగా క్షణాల్లో అంతా తారుమారైపోయింది.. ఆయన కుటుంబంతో పాటు, అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది.. ఆయన కుటుంబంలో జరిగిన విషాదం వేరే కుటుంబంలో జరగకూడదని జూనియర్ ఎన్టీఆర్ ప్రతిసారి అందరికీ గుర్తుచేశారు.. కానీ అదే కుటుంబంలో మరో విషాదం జరిగింది.. అందరూ బాగుండాలని కోరుకున్న కుటుంబానికి ఇలాంటి కష్టం రావటం చాలా బాధాకరం.. కానీ హరికృష్ణ మరణం మనకొక పాఠం నేర్పుతుంది.. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి.. మీ నిర్లక్ష్యం వల్ల మీ ప్రాణాలు పొతే అది మీ కుటుంబానికి ఎవరు తీర్చలేని లోటు.. ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు ఒక్కసారి కుటుంబం గురించి ఆలోచించండి.. ప్రయాణంలో నిర్లక్ష్యంగా ఉండి మీ జీవిత ప్రయాణానికి అర్దాంతరంగా ముగింపు పలకకండి.