చంద్రబాబు చెవిలో హరికృష్ణ జోరీగ!

Publish Date:Apr 17, 2014

 

 

 

ఈ ఎన్నికలలో కనీసం సీమాంధ్రలో అయినా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కాలని, ఢిల్లీలో చక్రం తిప్పాలని నానా తంటాలూ పడుతున్న చంద్రబాబు అనేక ఒత్తిళ్ళు ఎదుర్కొంటున్నారు. ఉన్న ఒత్తిళ్ళు చాలవన్నట్టు బావమరిది హరికృష్ణ నుంచి వస్తున్న బెదిరింపులు ఆయనకి చిరాకు పుట్టిస్తున్నాయి. హరికృష్ణ వల్ల పార్టీకి దమ్మిడీ ఉపయోగం లేకపోయినా ఆయన్ని ఇంతకాలం పార్టీ భరిస్తూ వస్తోంది.

 

ఎన్టీఆర్ నుంచి అధికార బదలాయింపు (దీనిని గిట్టనివాళ్ళు వెన్నుపోటు అంటూ వుంటారు) సమయంలో చంద్రబాబుకు హరికృష్ణ అండగా నిలిచినందుకు ఆయన దానికి తగిన ప్రతిఫలం అప్పుడే రవాణా శాఖ మంత్రి రూపంలో పొందారు. ఆ తర్వాత చాలాసార్లు బావకి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తూ హరికృష్ణ ఏదో ఒక పదవి పొందుతూనే వున్నారు. తనను మాత్రమే కాకుండా తన కొడుకు జూనియర్ ఎన్టీఆర్ని కూడా గౌరవించాలని, తాము చెప్పిన లిస్టుకి టిక్కెట్లు ఇవ్వాలని... ఇలా రకరకాల డిమాండ్లతో విసిగిస్తున్న హరికృష్ణని చంద్రబాబు పట్టించుకోవడం మానేశాడు.

అయినా హరికృష్ణ ఏదో ఒక సాకు చెప్పి చంద్రబాబుని విసిగించడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. చంద్రబాబుని సాధించడంలో భాగంగా సమైక్యాంధ్ర ఉద్యమం ముసుగు వేసి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినా చంద్రబాబు నుంచి స్పందన లేకపోవడంతో హరికృష్ణ అల్లాడిపోతున్నాడు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో హరికృష్ణ మరోసారి రంగంలోకి దిగారు. తాను ఏదైనా అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వమంటూ చెవిలో ఇల్లు కట్టుకుని పోరినా చంద్రబాబు పట్టించుకోవడం లేదని హరికృష్ణ తన ఆక్రోశం వెళ్ళగక్కుతున్నాడు. ఎక్కడి టిక్కెట్ ఇచ్చినా హరికృష్ణ పొరపాటున కూడా గెలవడన్న ఉద్దేశంలో వున్న చంద్రబాబు హరికృష్ణ డిమాండ్‌ని ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు.

అయినా వెనుకడుగు వేయని హరికృష్ణ తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూనే వున్నాడు. తనకి తెలుగుదేశం తరఫున టిక్కెట్ ఇవ్వకపోతే వేరే పార్టీ నుంచి పోటీ చేసి తెలుగుదేశం పరువు తీస్తానని చంద్రబాబును హరికృష్ణ బెదిరిస్తున్నట్టు సమాచారం.  చెప్పులోన రాయి చెవిలోన జోరీగ చాలా ఇబ్బంది పెడతాయి. ప్రస్తుతం చంద్రబాబు విషయంలో హరికృష్ణ కూడా అలాగే వున్నాడు.

By
en-us Political News