యంగ్ టైగర్ జీవితంతో సీతయ్య ఆడుకొంటున్నాడా

 

నందమూరి వంశస్థుడయిన తనకు తెలుగుదేశం పార్టీలో తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని చీటికి మాటికి అలుగుతూ ఎప్పుడో ఓసారి పార్టీ కార్యక్రమాలకి వచ్చి అప్పుడు కూడా తనదయిన శైలిలో వ్యవహరించే హరికృష్ణ, పార్టీతో సంప్రదించకుండా సమైక్యాంధ్ర వేడిలో తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయన పరిస్థితి ఇప్పుడు రెంటికీ చెడిన రేవడిగా తయారయింది.

 

ఆ మధ్య వైకాపా జూనియర్, సీనియర్ యన్టీఆర్ ల ఫోటోలను తన పార్టీ బ్యానర్లలో వేసుకొని తెదేపాతో మైండ్ గేమ్స్ మొదలుపెట్టినప్పుడు, అతని సోదరుడు గట్టిగా ఖండించినప్పటికీ హరికృష్ణ మాత్రం అందులో తప్పేమిటి? అన్నట్లుగా మాట్లాడటంతో కేవలం ఆయనపైనే కాకుండా ఆ ప్రభావం అయన కుమారుడు జూ.యన్టీఆర్ సినిమాలపై కూడా నేటికీ తీవ్ర ప్రభావం చూపుతోంది. పార్టీకి, తమకి మధ్య ఏర్పడిన ఆ దూరాన్ని తగ్గించుకోవాలని ఇరువైపులా వారు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంతో వారి మధ్య ఆదూరం అలాగే ఉండిపోయింది.

 

రాష్ట్ర విభజన వ్యవహారంతో పార్టీ తీవ్రంగా సతమవుతున్నతరుణంలో హరికృష్ణ తన యంపీ పదవికి రాజీనామా చేయడం ఆ దూరాన్ని మరింత పెంచింది. ఆయన తనకు ఏ కారణంగా పార్టీలో ప్రత్యేక హోదా, గౌరవం కలిగి ఉండాలని ఆశిస్తున్నారో, ఇప్పుడు అదే నందమూరి వంశం అర్హత కారణంగానే ఆయన రాజీనామా పార్టీని ఇబ్బందులలో పడేసింది.

 

చంద్రబాబు పార్టీని కాపాడుకోవడానికి తలపెట్టిన ఆత్మగౌరవ యాత్రకు సమాంతరంగా ఆయన కూడా సమైక్యాంధ్ర కోసం ‘చైతన్యయాత్ర’ మొదలుపెడతానని ప్రకటించినా, బహుశః పార్టీ ఒత్తిడి వలననే ఆ ప్రయత్నం విరమించుకొన్నట్లు భావించవలసి ఉంటుంది. కానీ మళ్ళీ ఈ మధ్య ఆయన ‘తెలుగుజాతి మనోవేదన’ అంటూ ప్రజలకు మూడు పేజీల బహిరంగ లేఖ ఒకటి పత్రికలకి విడుదల చేసారు.

 

అందులో రాష్ట్ర విభజన చేస్తున్నకాంగ్రెస్ అధిష్టానాన్ని, దాని ఉద్దేశ్యాలని వివరించి, అధిష్టానానికి తలొగ్గి ప్యాకేజీలు కోరుతున్న కాంగ్రెస్ యంపీలను, కేంద్రమంత్రులను, వారి అధిష్టానాన్నికూడా దుమ్మెత్తి పోశారు. కానీ ఆయన అంతటితో ఆగకుండా 'సమన్యాయం' అంటూ మాట్లాడటం కూడా తెలుగుజాతిని ద్రోహం చేయడమేనంటూ పరోక్షంగా మళ్ళీ స్వంతపార్టీకి కూడా చురకలు వేసారు.

 

ఇంకా రాజకీయాలలోనే కొనసాగాలనుకొంటున్న హరికృష్ణ ఈ బహిరంగలేఖతో ఏమి సాధించదలచుకోన్నారో తెలియదు. కానీ తనసమైక్యవాదంతో అటు వైయస్సార్ కాంగ్రెస్ తోనూ కలవలేక, ఇటు స్వంత పార్టీతోను కలవలేక తన రాజకీయ జీవితాన్నే కాకుండా తన కుమారుడు ఎంతో కష్టపడి నిర్మించుకొన్న సినిమా జీవితాన్నికూడా నాశనం చేస్తున్నారు.

 

ఆయన చేస్తున్న సమైక్యవాదం వల్ల రాష్ట్ర విభజన ఆగిపోదు. వైకాపా అతనికి బాజా బజంత్రీలతో ఎదురేగి పార్టీలోకి స్వాగతం పలకదు. రెండు రాష్ట్రాలకి సమన్యాయం కోరుతున్న తెదేపా ఆయనని దరిచేరనీయదు. పైగా ఈ ప్రభావం ఆయన కుమారుడి సినీజీవితాన్ని కూడా దెబ్బ తీస్తోంది. ఆయన చేస్తున్నసమైక్యవాదం వలన తెలంగాణాలో యన్టీఆర్ సినిమాలకు ఆటంకాలు ఎదురవుతుంటే, ఆ తండ్రీ కొడుకులు వైకాపాకు దగ్గరవుతున్నారనే అనుమానంతో ఆంధ్రాలో అభిమానులు దూరం అవుతున్నారు.

 

హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. కనీసం పార్టీ సభ్యుడిగా క్రియాశీలకంగా పార్టీ వ్యవహారాలలో పాల్గొన్నదీ లేదు. అటువంటప్పుడు పార్టీ నుండి కానీ ప్రజల నుండి గానీ ఆయన ఏదో ఆశించడం అవివేకం. కనీసం రాజకీయ సన్యాసం స్వీకరిస్తే కనీసం ఆయన తన కుమారుడు యన్టీఆర్ కయినా మేలు చేసినవారవుతారేమో ఆలోచిస్తే బాగుంటుంది.