హరికృష్ణ చైతన్య యాత్ర
Published on: Wed Aug 21, 2013 12:18PM

రాష్ట్ర విభజనను నిరసిస్తూ తెలుగువారంతా ఒక్కటిగానే ఉండాలని, వారిని విడదీయొద్దని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ చైతన్యయాత్ర చేయనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ తెలుగువారి ఆత్మగౌరవ పతాకాన్ని తలకెత్తుకుని 1982లో ఎన్టీఆర్ చైతన్యయాత్ర చేశారు.
కేవలం తొమ్మిదినెలలలో రాష్ట్రంలో పాతుకుపోయిన కాంగ్రెస్ పాలనను కూకటివేళ్లతో పెకలించారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుందని లేఖలు రాసి నిరసన తెలుపుతున్న హరికృష్ణ తాజాగా చైతన్య యాత్ర చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన అనంతపురం జిల్లా హిందూపురం నుండి ఈ యాత్రను చేపట్టనున్నారని సమాచారం. ఇక ఆయన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా నుండి తెలుగు ఆత్మగౌరవ యాత్రకు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ రెండు యాత్రలకు ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతారో వేచిచూడాలి.


