అక్కడ మినిస్టర్ కంటే టెర్రరిస్ట్ లీడరే పవర్ ఫుల్!

పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం వుంది. కాకపోతే, అది నేతి బీరకాయలో నేతిలాగా ఉండీ లేనట్టుగానే వుంటుంది! అదే... ఆ దేశానికీ, పక్క దేశాలకీ కూడా అతి పెద్ద ప్రమాదం. మరీ ముఖ్యంగా, భారతదేశానికి. అక్కడ ఉగ్రవాదులు వుంటారనేది పెద్ద ఆశ్చర్యకర విషయమూ, ఆందోళనకర విషయమూ కాదు. ఇండియా నుంచీ అమెరికా దాకా అన్ని దేశాలకూ తెలిసిన సత్యమే. కాని, పాక్ లో ఒక ఉగ్రవాద నాయకుడికి ఎంత బలము, గౌరవము, పట్టు వుంటాయో తాజాగా తెలిసిపోయింది. ఆ దేశంలో వారి రక్షణ మంత్రి కంటే కూడా ఒక కరుడుగట్టిన ఉగ్రవాదికి ఎక్కువ విలువ!

 

 

ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రం పాకిస్తాన్. సిరియా, ఇరాక్ లాంటి దేశాలలో ఐసిస్ వికృతమైన హింసకు పాల్పడుతుండవచ్చు. కాని, పాకిస్తాన్ లో జరుగుతున్నంత కుట్ర మాత్రం మరెక్కడా జరగటం లేదు. దేశదేశాల్లో ఉగ్రవాదానికి మూలాలన్నీ పాక్ లో వుంటాయి. ఎందుకంటే,అక్కడ అధికారికంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే ఉగ్రవాద నేతలకి దాసోహం అంటుంది. సకల సౌకర్యాలు కల్పించి ప్రపంచాన్ని అస్థిరపరిచే కుట్రలు చేసుకోనిస్తుంది. ఇందుకు ఆల్ ఖైదా అధినేత ఉసామా బిన్ లాడెన్ మరణమే తార్కాణం. ఆ దేశంలో లాడెన్ అమెరికా సేనల చేతిలో హతమయ్యాడు. అయినా అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ పాక్ ఉగ్రవాదం విషయంలో తనకేం తెలియదనే బుకాయిస్తుంటుంది. ఇండియాకి మోస్ట్ వాంటెడ్ అయిన మసూద్ అజర్, దావూద్ లాంటి వార్ని కూడా పాక్ భద్రంగా కాపాడుతూ వుంటుంది. ఇది పబ్లిక్ సీక్రెట్టే... 

 

 

పాక్ లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతారని తెలిసినప్పటికీ అక్కడ వారికి ఎలాంటి గౌరవ మర్యాదలు దక్కుతాయో తాజాగా తేలిపోయింది. ముంబై నగరంపై దాడులకి స్కెచ్ వేసి వందల మందిని పొట్టన పెట్టుకున్న హఫీజ్ సయీద్ పాకిస్తానీయే. అక్కడ జమాత్ ఉల్ దవా అనే పేరుతో ఒక రాకాసి సంస్థని నడుపుతూ అరాచకం సృష్టిస్తుంటాడు. అయితే, ఈ మధ్యే ట్రంప్ దెబ్బకు గజగజ వణికిన ఇస్లామాబాద్ హఫీజ్ ను హౌజ్ అరెస్ట్ చేసింది. ఉగ్రవాదుల జాబితాలో కూడా చేర్చింది. ఇది అమెరికన్ ప్రెసిడెంట్ ని ప్రసన్నం చేసుకోటానికే. ఇప్పటికే కొన్ని దేశాల పౌరులు అమెరికాలో కాలుపెట్టొద్దన్న ట్రంప్ పాక్ ను కూడా టార్గెట్ చేస్తాడని పాకిస్తాన్ పాలకుల భయం. అందుకే, కనీసం డ్రామా కోసమైన హఫీజ్ ను ఇంట్లోనే బంధించి వుంచారు. కాని, వాళ్ల స్వంత రక్షణ మంత్రే హఫీజ్ ను ఉగ్రవాది అని, ప్రపంచానికి ప్రమాదకరమైన వ్యక్తి అని అంటే తట్టుకోలేకపోయారు. 

 

 

పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా అసిఫ్ హఫీజ్ సయీద్ సమాజానికి అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించాడు. దీన్ని భారతదేశం సహజంగానే స్వాగతించింది. కాని, తమ దేశ రక్షణ మంత్రైనా కరుడుగట్టిన హఫీజ్ సయీద్ ను కించపరచటం పాక్ లోని చాలా మంది తట్టుకోలేకపోయారు. వివిధ పార్టీల నాయకులు నిస్సిగ్గుగా ఆయన మాటల్ని ఖండించారు. హఫీజ్ చాలా గోప్ప మహానుభావుడని కీర్తించారు. దేశ వ్యాప్త నిరసనలు కూడా మొదలు పెట్టారు పాక్ లోని శాంతి కాముకులు! ఇలాంటి బరితెగించిన మద్దతు ఉగ్రవాద నేతలకు అ దేశంలో దొరుకుతుండటం వల్లే రక్త పిశాచాలు అక్కడ హాయిగా తిష్ఠవేశాయి. మొన్నటికి మొన్న మసీదులో బాంబులు పేల్చి స్వంత పాకిస్తానీల్నే వంద మందిని పొట్టన పెట్టుకున్నారు హఫీజ్ లాంటి ఉగ్ర నేతలే. అయినా అక్కడి నాయకులకి బుద్ది రావటం లేదు!