ఏపీలో ఆగని కూల్చివేతలు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే భవనం నేలమట్టం!!

 

ఏపీలో అధికారంలోకి రాగానే అక్రమ నిర్మాణాలపై దృష్టిసారించిన వైసీపీ సర్కార్.. కృష్ణానది కరకట్టపై ఉన్న ప్రజావేదిక కూల్చివేతతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. ఆ తరువాత అక్రమ నిర్మాణాలు అంటూ పలువురికి నోటీసులు అందాయి. మరోవైపు కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇటీవల నెల్లూరులో టీడీపీ నేతలకు చెందిన మూడు ఇళ్లను అధికారులు కూల్చేశారు. అక్రమ నిర్మాణాలని, ముందే నోటీసులు ఇచ్చి కూల్చేశామని అధికారులు చెప్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తూ కూల్చేస్తుందని ఆరోపిస్తుంది. అయినా ఈ కూల్చివేతలు ఆగేలా లేవు. 

తాజాగా విశాఖకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనాన్ని అక్రమంగా నిర్మించారంటూ జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. విశాఖలోని ద్వారకానగర్ మెయిన్‌రోడ్డులో పీలా గోవింద్ భవనం నిర్మించుకున్నారు. అయితే సరైన అనుమతులు లేకుండా డ్రైన్ ఆక్రమించి భవనం నిర్మించారని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దీనికి సంబంధించి పలుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. కానీ దీనిపై పీలా గోవింద్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో రంగంలోకి దిగిన జీవీఎంసీ అధికారులు శనివారం ఉదయమే ఈ కూల్చివేత కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కూల్చివేతతో ద్వారకానగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.