ఇవేం ఆరోపణలు జీవీఎల్...

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. రాజకీయాల్లో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం అనాది సంప్రదాయం. రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు చేయడం కూడా చాలాకాలం నుంచి వస్తున్నదే. అయితే గతంలో ఈ విమర్శలకు,ఈ బురద జల్లుకోవడానికి, ఈ అవినీతి ఆరోపణలకు ఓ నిబద్దత, ఓ నైతికత, ఓ విలువ, ఓ ఆధారం, ఓ సత్యం ఉండేవి. నేటి రాజకీయాలలో అవి కనుమరుగు కావడమే నేటి విషాధం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఆరోపణలు, ఈ విమర‌్శల స్ధాయి దాటి జరుగుతున్నాయి. అంతే కాదు... నిజానిజాలు తెలియకుండా... కనీసం తెలుసుకోకుండా నాయకులు ఎదుటి వారిపై బురదజల్లుతున్నారు. దీంతో వారి మాటలకు విలువ లేకుండా పోతోంది. దీనికి తాజా ఉదాహరణ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీ.వీ.ఎల్. నరసింహారావు చేసిన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ పని చేస్తున్న ఉన్నతాధికారుల ఖాతాలలో ఏకంగా 59 వేల కోట్ల రూపాయల దాచిందన్న ఆరోపణ. ఇది ఆయన రాజకీయ పరిణితికి ఓ మచ్చుతునక. ఇది ఆయన అవగాహనా లేమికి ఓ పరాకాష్ట. ఇది ఆయన అనుభవానికి ఓ పరీక్ష.

 

 

ప్రతి రాష్ట్రంలోనూ ఆయా అధికారుల పేరిట ప్రభుత్వాలు కొన్ని వ్యక్తిగత ఖాతాలు తెరుస్తాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పద్దతి. వీటిని ఇంగ్లీషులో పీడీ అకౌంట్లు అంటారు. వీటిని అన్ని రాష్ట్రాలు అత్యవసర నిధుల గనిగా పేర్కొంటాయి. ఏ రాష్ట్రంలోనైనా పెద్ద ప్రాజెక్టులు నిర్వహించాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు సంబంధించిన కొన్ని అత్యవసర కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చినప్పుడు బ్యాంకుల్లో అధికారుల పేరిట ఉన్న ఈ పీడీ ఖాతాల నుంచి నిధులు వినియోగిస్తారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయిన జీ.వీ.ఎల్.నరసింహారావుకు ఇది కూడా తెలియకపోవడం ఆయన అమాయకత్వాన్ని తెలియజేస్తోంది. ఆయన అన్నట్టు ఈ పీడీ ఖాతాలు తెలుగుదేశం కార్యకర్తల పేరు మీద ఉండవు. అధికారుల పేరు మీదే ఉంటాయి. రాష్ట్ర బడ్జెట్‌తో  పాటు మార్గాల ద్వారా వచ్చిన గ్రాంట్లు ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి ఈ నిధులు కూడా అంతమవుతాయి. అలాంటి కీలక సమయంలో పీడీ ఖాతాల్లోని నిధులను ప్రభుత్వాలు వినియోగించడం కద్దు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ పీడీఖాతాల్లోని నిధులను వాడతారన్న విషయాన్ని జీ.వీ.ఎల్.నరసింహారావు తెలుసుకోవడం ఆయనకే ఎంతో మేలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాజస్ధాన్, గుజరాత్‌ల్లోనే ఈ నిధులను వాడుతున్నారు. రాజస్థాన్‌లో ఏకంగా 34, 613 కోట్ల రూపాయల నిధులను పీడీ ఖాతాల నుంచి వాడారు. దేశంలో ఇదే ఎక్కువగా వాడిన రాష్ట్రం.

 

 

ఇక మహారాష్ట్రలో అయితే 21, 605 కోట్లు, తెలంగాణలో 10, 873 కోట్లు, గుజరాత్‌లో 395 కోట్లు, హర్యానాలో 235 కోట్ల రూపాయలు ఈ ఖాతాల్లోంచి వినియోగించారనే విషయం జీ.వీ.ఎల్ గ్రహించాలి. ఆయన ఆరోపిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26, 513 కోట్ల రూపాయలు పీడీ ఖాతాల నుంచి వినియోగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కలను కాగ్ ఈ సంవత్సరమే కాదు... ప్రతి సంవత్సరం ఊటంకిస్తుంది. తెలియంది ఒక్క జీ.వీ.ఎల్.నరసింహారావుకే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తమ రాజ్యసభ సభ్యుడు జీ.వీ.ఎల్. నరసింహారావును ప్రయోగించాలనుకుంటోంది. యుద్ధం పతాక స్ధాయికి చేరినప్పుడు ఆయుధాలను చాలా ఒడుపుగా, నేర్పరితనంతో ప్రయోగించాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. గాలిలో ఖడ్గచాలనం చేస్తే ఒక్కోసారి మన పీక కూడా తెగిపోవచ్చు. ఈ విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎంత త్వరగా తెలుసుకుంటే వారికి మంచిది. లేకపోతే ఇదిగో ఇలా పీకలు తెగిపోయే విమ‌ర్శలు చేసే పార్టీ మనుషులు పుట్టుకొస్తారు.