బీజేపీలోకి ముద్రగడ!.. కాపు రాజకీయంలో కాక!
Published on: Tue Feb 22, 2022 1:51PM
కాపు సామాజిక ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బీజేపీ గూటికి చేరనున్నారా? ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో అవుననే సమాధానం వస్తోంది. అయితే ముద్రగడ పద్మనాభంతో కమలం పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఇటీవల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు కీలక అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
స్తబ్దుగా ఉండే కంటే.. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి.. క్రియాశీలకంగా వ్యవహారించాలంటూ ముద్రగడకు జీవీఎల్ సూచించినట్లు సమాచారం. అయితే వీరిద్దరి భేటీ అనంతరం కాపు జేఏసీ నేతలు సైతం అక్కడికి రావడంతో... వారితో కూడా జీవీఎల్ ముచ్చటించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారిని కూడా జీవీఎల్ బీజేపీలోకి ఆహ్వానించారని సమాచారం.
ఈ సందర్భంగా వీరి మధ్య కాపు రిజర్వేషన్ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లు పెట్టడం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు... అలాగే కాపు రిజర్వేషన్ బిల్లుపై ప్రస్తుత జగన్ ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఈ సందర్బంగా చర్చకు వచ్చినట్ల తెలుస్తోంది. అయితే ఈ భేటీ అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఎంపీ జీవీఎల్... మొత్తం కాపు రిజర్వేషన్ అంశంపైనే మాట్లాడారు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న కాపు రిజర్వేషన్ బిల్లు.. ప్రస్తుత తరుణంలో లేకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. కాపు రిజర్వేషన్ల అంశం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ పరిధిలోదంటూ ఆయన తేల్చేశారు.
అయితే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పంపిన రిజర్వేషన్ బిల్లును తిప్పి పంపారు. కేంద్రం ఇచ్చిన పది శాతం ఈబీసీ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అందులో భాగంగా సదరు సామాజిక వర్గం వారికి సర్టిఫికెట్లు కూడా జారీ ప్రక్రియ ప్రారంభించారని.. కానీ కానీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని నిలిపివేసిందని సమాచారం.
ఇక చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం... వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ కావడం పట్ల ఆయనే లక్ష్యంగా పలు విమర్శలు అయితే సోషల్ మీడియా సాక్షిగా వెల్లువెత్తాయి. మరోవైపు కాపు సామాజిక వర్గాన్ని కమలం పార్టీ దగ్గర చేసుకునే క్రమంలోనే ముద్రగడతో బీజేపీ ఎంపీ జీవీఎల్ భేటీ జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


