వైసీపీ తో టీఆర్ఎస్ పొత్తు

 

ఫెడరల్ ఫ్రెంట్ పై చర్చలు జరిపేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. కాగా ఈ భేటీపై పలువురు టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి స్పందించారు. జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగానే కేటీఆర్ ..జగన్‌ ని కలిశారని స్పష్టంచేశారు. జగన్‌ను కేటీఆర్‌ కలవడంతో టీడీపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌-వైసీపీ పొత్తు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూడలేక టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటూ టీడీపీ విషప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. బీజేపీతో 4సంవత్సరాలు సంసారం చేసి ఇప్పుడు టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీని, కాంగ్రెస్‌ని ఏవిధంగా తిరస్కరించారో.. ఆంధ్రాలో కూడా టీడీపీని, కాంగ్రెస్‌ని ప్రజలు తిరస్కరించడం ఖాయమని జోస్యం చెప్పారు.